కాళేశ్వరం, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి : వైఎస్​షర్మిల

కాళేశ్వరం, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి : వైఎస్​షర్మిల

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఓ తెల్ల ఏనుగులా మారిందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. కుక్క తోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు. పంప్ హౌజ్ ల నిర్మాణం కూడా క్వాలిటీ లేకుండా నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కేవలం (వైఎస్ హయంలో 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు, కేసీఆర్ హయంలో మొత్తం18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు ) 2 లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని మూడింతలు పెంచారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

వైఎస్​రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేశారని, 38 వేల కోట్లతో 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేయించారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ బతికి ఉన్న సమయంలోనే దాదాపు 7 వేల కోట్లు ఖర్చు కూడా చేశారని, ఆ మేరకు పనులు కూడా జరిగాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పూర్తిగా ఆ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేయించారని చెప్పారు. లక్షా 20 వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని తీసుకెళ్లారని, కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కట్టారని ఆరోపించారు. అవసరం లేకున్నా... అనవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్ లు, మోటార్లు నిర్మించారని చెప్పారు. కమీషన్లు తీసుకునే విధంగా ప్రాజెక్టును రీ డిజైన్ చేయించారని విమర్శించారు. 

ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ అన్నారు. ఇదే విషయంపై గతంలో తాము తెలంగాణ గవర్నర్, ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే రాబోయే రోజుల్లో ఇంకెన్నీ ఘోరాలు చూడాలని ప్రశ్నించారు. దేశానికి సంబంధించిన లక్షల కోట్ల డబ్బు వృథా చేస్తుంటే.. ఇంత అవినీతి జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఏం చేస్తుందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వాచ్ డాగ్ లా ఉండాల్సిన అవసరం కేంద్రానికి లేదా..? అని ప్రశ్నించారు. 

కేంద్రమంత్రులే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి, ఆరోపణలు చేస్తున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే అన్నారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీ నేరుగా మద్దతు ఇస్తుంటే... బీజేపీ మాత్రం రహస్యంగా మద్దతు ఇస్తోందన్నారు. అందుకే ప్రధాని మోదీ... సీఎం కేసీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై, సీఎం కేసీఆర్ పై, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.