దేశంలో భారతీయ జనతా రాజ్యాంగం నడుస్తోంది: వైఎస్ షర్మిల

దేశంలో  భారతీయ జనతా రాజ్యాంగం నడుస్తోంది: వైఎస్ షర్మిల

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి. కాంగ్రెసు పార్టీ బలపడకూడదని బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందని.. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై ఐటీ దాడి చేయించిందని మండిపడ్డారు. ఇప్పటికే రూ.230 కోట్లుర సీజ్ చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ఎన్నికలు ముగిసే సరికి ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందోనని అన్నారు.

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చేరిగారు. దేశంలో ప్రస్తుతం భారతీయ జనతా రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇది భారతీయ జనతా పార్టీనా లేక భయంకరంగా బెదిరిస్తున్న జనకంటక పార్టీనా అంటూ ఫైరయ్యారు. అసలు మీ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.  బీజేపీకి రూ.7 వేల కోట్ల ఎలోక్టోల్ బాండ్ ఎలా వచ్చాయని ఆమె నిలదీశారు. బీజేపీ అవమానిస్తున్నది కాంగ్రెస్ పార్టీని కాదు.. దేశ ప్రజలను అవమానిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఓ నమ్మకం.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందని చెప్పారు

ఓటమి భయంతోనే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు షర్మిల. ప్రత్యేక హోదా ఏమైంది.. నాడు ఇవ్వలేదని అన్నది ఇదే చంద్రబాబు.. మళ్ళి వాళ్ళతో ఎలా పొత్తు కోసం ఆరాటపడ్డారని విమర్శించారు. ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎందుకు కృషి చేయలేదని.. ప్రజల సమాధానం చెప్పాలన్నారు షర్మిల.