కాంగ్రెస్ లోకి షర్మిల.. అన్నయ్య జగన్ పార్టీని ఢీకొట్టడమే లక్ష్యం

కాంగ్రెస్ లోకి షర్మిల..  అన్నయ్య జగన్ పార్టీని ఢీకొట్టడమే లక్ష్యం

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. జనవరిలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోనూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిలను రంగంలోకి దించడం ద్వారా ఏపీలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఏఐసీసీ యోచిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే సత్తా షర్మిలకే ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఆమెను రంగంలోకి దింపడం ద్వారా ఏపీలో సక్సెస్ కావాలని భావిస్తోందని సమాచారం. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి  రాబోతున్నారని ఇప్పటికే ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రుద్రరాజు  ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారనే విషయాన్ని కూడా ఆయన గతంలో వెల్లడించారు. కాంగ్రెస్ లో ఆమె ఏ పాత్ర పోషించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

కర్నాటక నుంచి రాజ్యసభకు

తెలంగాణలో తమ పార్టీకి వైఎస్ షర్మిల భేషరతుగా మద్దతు ప్రకటించి ఎన్నికల నుంచి తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమె త్యాగానికి ప్రతిఫలం కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను కర్నాటక  నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నడీకే శివకుమార్, సిద్ధరామయ్యలాంటి వారు  ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.