కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని.. తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్‎కు లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామంలో కొనసాగుతోంది. కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామంలోని రైతు వేదిక దగ్గర... యాసంగి వడ్లను కేసీఆర్ కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు.  సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ఇవ్వట్లేదని... రైతులు అప్పులపాలు కావడానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనమని.. ఏ రైతుని అడిగి ఒప్పందంపై సంతకం చేశారని కేసీఆర్‎ని ప్రశ్నించారు షర్మిల. రైతులకు క్షమాపణలు చెప్పి.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

‘బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, రైతుల్ని నట్టేట ముంచాడు. కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ వ‌స్తుంద‌ని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వ‌బోమ‌ని ఎలా లేఖ రాశారు? 80 వేల పుస్త‌కాలు చ‌దివిన అప‌ర‌మేధావికి ఈ విషయం తెలియదా? కేసీఆర్ లేఖ వ‌ల్ల‌నే కేంద్రం వ‌డ్లు కొన‌మ‌ని చెబుతోంది. అందువ‌ల్ల కేసీఆరే వడ్ల‌న్నీకొనుగోలు చేయాలి. వ‌రి వేసుకునే హ‌క్కు రైతుల‌కు ఉంది. దాన్ని కాల‌రాసే అధికారం ఎవ‌రికీ లేదు. కేసీఆర్ త‌ప్పులకు రైతుల‌ను శిక్షించ‌డం న్యాయం కాదు. కేసీఆర్ బేష‌ర‌తుగా ముక్కునేల‌కు రాసి రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు.

For More News..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వ్యూహం ప్రకారమే భారత వైఖరి

వీడియో: సాయం కోసం మెట్రో మాల్ ముందు క్యూలైన్లు

హైదరాబాద్ లో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్