లక్షల మందికి పెన్షన్లు వస్తలె

లక్షల మందికి పెన్షన్లు వస్తలె
  • రెండు సార్లు గెలిపిస్తే కేసీఆర్ ఏం చేసిండు?
  • ఏడేండ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు
  • ఉద్యోగాలు రాక నిరుద్యోగులు సచ్చిపోతున్నరు
  • వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌ను రెండు సార్లు గెలిపిస్తే ఏం చేశారని వైఎస్ఆర్టీపీ చీఫ్  వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ రోజూ ఎంతో మంది సమస్యలను తనతో చెప్పుకుంటున్నారని అన్నారు. ‘‘రుణమాఫీ, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎవరికైనా వచ్చాయా? పింఛన్లు కూడా రావడం లేదు. పెన్షన్ తీసుకుంటున్న వాళ్లు చనిపోతే.. కొత్త వాళ్లకు ఇవ్వడం లేదు. పెద్దలను కూడా కేసీఆర్ మోసం చేశారు. పెన్షన్లు రాక లక్షల మంది  ఇబ్బందులు పడుతున్నారు” అని మండిపడ్డారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా 11వ రోజు శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని జంపల్ గ్రామం, ఎల్లమ్మతండా, రంగాపూర్, జలాల్ మియాపల్లి క్రాస్, చీదేడు, దాడ్పల్లి క్రాస్, యాచారం మండలం మొండిగొర్వెల్లి దాకా 12.8 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. చీదేడులో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్లు టీ, టిఫిన్ సెంటర్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నారని, ఎంతో మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌‌తో ఎవరకి మేలు జరిగిందని, 20 ఎకరాల భూమి ఉంటే 15 ఎకరాలే పోర్టల్‌‌లో చూపెడుతోందన్నారు. ఏడేండ్లలో 8 వేల మంది రైతులు, వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యు చేసుకున్నారని, వారి ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు.

కరోనా బిల్లులను సర్కారే కట్టాలి
కరోనా వస్తే రూ.6 లక్షలు అప్పు చేసి ట్రీట్‌‌మెంట్ చేయించినా తన భర్త దక్కలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసిందని షర్మిల తెలిపారు. రాష్ర్టంలో ఇలా ఎంతో మంది ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్స్ బిల్లులు కట్టారని, ఆ బిల్లులను సర్కారే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆదుకోకుంటే ఇక ప్రభుత్వం ఎందుక్నని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని కేసీఆర్​కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌ ఏమో యశోదా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ చేయించుకుని.. ప్రజలను సర్కార్ హాస్పిటల్​కు వెళ్లమని చెప్పిండని విమర్శించారు. ఇప్పటికైనా బాధితుల కరోనా బిల్లులు చెల్లించి కేసీఆర్​కు మనసుందని నిరూపించుకోవాలన్నారు.

బాలికల బడిలో లైట్లు, ఫ్యాన్లు లేవు
మంచాల మండలంలోని రంగాపూర్ గ్రామంలో మినీ గురుకుల ఎస్టీ బాలికల స్కూలును షర్మిల పరిశీలించారు. పిల్లలకు పడుకునేందుకు బెడ్లు లేవని, లైట్లు, ఫ్యాన్లు లేవని హెచ్ఎం, టీచర్ చెప్పారు. 23 ఏండ్లుగా వంట చేస్తున్న వాళ్లకు రూ.7 వేలు మాత్రమే  జీతమిస్తున్నారని, పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తున్నామని వర్కర్లు వాపోయారు.