రాష్ట్రాన్ని లిక్కర్ ఆదాయంతో పాలిస్తున్నారు

రాష్ట్రాన్ని లిక్కర్ ఆదాయంతో పాలిస్తున్నారు
  • ఉద్యోగాలు ఇస్తవా... రాజీనామా చేస్తవా?
  • కేసీఆర్​పై షర్మిల మండిపాటు
  • రాష్ట్రాన్ని లిక్కర్ ఆదాయంతో పాలిస్తున్నారని ఫైర్​
  • తిమ్మాపూర్​లో​ నిరుద్యోగ నిరాహార దీక్ష

హైదరాబాద్, వెలుగు: ‘‘ వందలాది మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదు కానీ అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకు మాత్రమే పదవులొచ్చాయి. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఉద్యోగాలు ఇవ్వాలని ఎంత మొరపెట్టుకున్నా కేసీఆర్ స్పందించడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి కూడా సీఎంకు లేదు. నిరుద్యోగులు కండ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కనికరం చూపించడం లేదు. దున్నపోతు మీద వానపడ్డట్లుగా వ్యవహరిస్తున్నారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నరు.. అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ను ఏం చేయాలో ప్రజలే తేల్చాలి. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ మాట నిలబెట్టుకోలేదు.

కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్​లో ఓడిపోతే..  వెంటనే ఎమ్మెల్సీని చేసి పదవి కట్టబెట్టారు. కానీ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగులుతున్నాయి’’ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.  మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఆగర్మియగూడ శివారులో మంగళవారం 4 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత షర్మిల తిమ్మాపూర్ కు చేరుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న ఆమె14వ వారం తిమ్మాపూర్ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్ష విరమించి మాట్లాడారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని దగా చేశారని, ముస్లింలకు12 శాతం రిజర్వేషన్ అని మోసం చేశారన్నారు.

పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, రూ. 4 లక్షల కోట్ల  అప్పులు చేసి, లిక్కర్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. ఏడేండ్లలో 3000 బడులను మూసివేశారని, 14 వేల మంది టీచర్లను తొలగించారన్నారు. నిరుద్యోగుల ఆవేదన సీఎంకు పట్టడం లేదని, ఫామ్ హౌస్​ లో  నిద్రపోవడానికా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది, మన పిల్లల్ని చంపుకోవడానికా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుందని షర్మిల ప్రశ్నించారు. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలని, 54 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలన్నారు. 10 లక్షల మంది అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఇవ‌‌‌‌న్నీ చేత‌‌‌‌కాక పోతే సీఎం ప‌‌‌‌ద‌‌‌‌వికి రాజీనామా చేసి, ద‌‌‌‌ళితుడిని ముఖ్యమంత్రి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.