చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల విడుదల

చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల విడుదల

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు.  నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో  కూడిన బెయిల్ ను మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రూ.30 వేలతో పాటుగా ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి కేసులో ఏప్రిల్ 24వ తేదీన సోమవారం వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. 

నాంపల్లి కోర్టులో షర్మిలను పోలీసులు హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  అయితే దీనిపై షర్మిల బెయిల్ పిటిషన్  దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు  బెయిల్ మంజూరు చేసింది.  అంతేకాకుండా కొన్ని షరతులను కూడా విధించింది.  విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి చేసింది. సాయంత్రం షర్మిల జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

సోమవారం (ఏప్రిల్ 24న) విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని ఆమె వెనక్కి నెట్టారు. పోలీసులు ఆపుతున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్‌ కాలిపైకి టైరు ఎక్కింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.