మా నాన్న చావును రాజకీయం చేయొద్దు

మా నాన్న చావును రాజకీయం చేయొద్దు

కడప: తన తండ్రి హత్య కేసును రాజకీయం చేయడం తగదని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె హత్య ఘటనపై  విచారణకు సిట్ టీమ్ ఏర్పాటు అయినా.. పారదర్శకంగా విచారణ సాగడం లేదని ఆరోపించారు. తన పనిని తాను చేసుకునేందుకు సిట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. తన తండ్రికి జగన్ సీఎం కావాలన్న కోరిక ఉందని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. దీనిపై ఓ వర్గం మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని.. ఇది ఎంతమాత్రమూ సరికాదన్నారు. సొంత కుటుంబీకులే పెద్దాయనను చంపారని ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడం ఆయన పైశాచిక రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.  తమ కుటుంబంలో దాదాపు 700 మందికి పైగా ఉన్నామని.. ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని విభేదాలుంటాయని.. అంతమాత్రాన హత్యలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు. బెంగళూరులో ఉన్న మిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. హత్య సమయంలో తన తండ్రి రాసిన లేఖ ఆయన స్వయంగా రాసిందా? కాదా? అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ తేలుస్తుందని చెప్పారు.