ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల జాబితా ప్రకటన విషయంలో, ప్రచారం విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న వైసీపీలో ఫిరాయింపులు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి పక్క పార్టీల్లో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న షర్మిల ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. జగన్ కు బలమైన ఓట్ బ్యాంక్ గా ఉన్న ముస్లిమ్ మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకొని జగన్ విజయావకాశాలను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబు పార్టీని వీడటం చిత్తూరులో వైసీపీకి బిగ్ లాస్ అనే చెప్పాలి.