
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని విస్మరించారన్నారు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదంటూ విమర్శించారు. అంతకుముందు షర్మిల వెనుక బీజేపీ ఉందని అర్థం వచ్చేలా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ కవిత ట్వీట్ చేశారు.
ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం
నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్ల దాడి, పోలీసుల తీరుకు నిరసనగా నిన్న షర్మిల చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేసిన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారులోంచి దిగకపోవడంతో టోయింగ్ వెహికల్ తీసుకువచ్చి కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. స్టేషన్‌లో బలవంతంగా కారు డోర్లు ఓపెన్ చేసి.. షర్మిల, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు. అయితే షర్మిల అరెస్ట్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.