మా పోరాటం వల్లే పాలక, ప్రతిపక్ష పార్టీలకు సోయి వచ్చింది

మా పోరాటం వల్లే పాలక, ప్రతిపక్ష పార్టీలకు సోయి వచ్చింది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక దొంగ అని..రేవంత్ రెడ్డి కంటే రోశయ్య బెటర్ అని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్..ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయాడని విమర్శించారు. ఆయన మాటలు ఎవరు నమ్మరంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్టీపీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తమ పార్టీ ఏడాదిలో ఎంతో పురోగతి సాధించిందని.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే పార్టీగా పేరు తెచ్చుకుందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్టీపీ ఎత్తిచూపిందని..తమ పోరాటం వల్లే పాలక, ప్రతిపక్ష పార్టీలకు సోయి వచ్చిందంటూ మండిపడ్డారు.

నిరుద్యోగుల కోసం మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేసినట్లు షర్మిల తెలిపారు. ప్రజలకు మేమున్నాము అని ధైర్యం చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కోట్లమంది ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికే ఉన్నారని అన్నారు. అయితే వైఎస్సార్ ఇచ్చిన అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ ఆయనకు కనీసం మెమోరియల్ ఘాట్ కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కూడా రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ తో జతకట్టిన తర్వాతే టీఆర్ఎస్ బలపడిందని..కానీ ఆ మహనేతకు ఇచ్చిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు.