దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ : నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల

దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ : నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. స్ట్రెచర్, వీల్ చైర్లు లేకపోవటంతో పేషెంట్ ను కాళ్లతో లాక్కుని తీసుకెళుతున్న వీడియోపై స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం దుస్థితికి ఇదే నిదర్శనం అన్నారామె. ఈ మేరకు ఏప్రిల్ 15వ తేదీ ట్విట్ చేశారామె. 

దొరగారూ అంటూ సీఎం కేసీఆర్ ను ప్రస్తావిస్తూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ అని ప్రశ్నించారు. రోగులను నేలపై లాక్కుని పోవడం కార్పొరేట్ వైద్యమా.. స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా అని నిలదీశారు షర్మిల. ప్రతి సంవత్సరం 11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఇది మీరు చెబుతున్న ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ అంటూ మండిపడ్డారామె. 

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన యువకుడుని.. ఆస్పత్రిలోకి తీసుకెళ్లటానికి ఎలాంటి సదుపాయాలు లేకపోవటంతో.. అతన్ని ఎత్తుకుని తీసుకెళ్లలేని పరిస్థితుల్లో.. రోగిని కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు తల్లిదండ్రులు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులకు ఈ వీడియో అద్దం పడుతుందన్నారు వైఎస్ షర్మిల.