
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని, ఆ పని ఎందుకు చేయడం లేదో తెలియదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న పార్టీ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణా, గోదావరి బోర్డుల విషయంలో కేసీఆర్, జగన్ ఏనాడైనా సీరియస్‌గా ఆలోచించారా? ఈ అంశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఇరు రాష్ట్రాల సీఎంలు ముందుకు రాలేదు కాబట్టి కేంద్రమే గెజిట్ విడుదల చేసింది. ఏ బోర్డు అయినా.. ఏ ప్రాజెక్ట్ అయినా.. తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టం. అదే విధంగా ఇతర ప్రాంతాలకు చెందిన నీళ్లను కూడా మేం అడ్డుకోం. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే.. ఢిల్లీకి వెళ్లైనా పోరాటం చేస్తాం. కేసీఆర్ ఏడున్నర ఏండ్లుగా నీటి సమస్యను తీర్చుకోలేకపోయారు” అని షర్మిల చెప్పారు.