కాళేశ్వరంతో 15 వందల కోట్ల నష్టం జరిగింది: షర్మిల

కాళేశ్వరంతో 15 వందల కోట్ల నష్టం జరిగింది: షర్మిల

కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందిని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ ఇన్సిస్టిట్యూట్ నుంచే వచ్చాయని తెలిపారు. సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బు అంతా ప్రజలదేనని చెప్పారు. కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగిందని తెలిసినా.. బీజేపీ నాయకులు ఎలా ఊరుకున్నారని విమర్శించారు. కేంద్రమంత్రులకు కూడా ఈ విషయం తెలిసినా.. ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.  దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. 

కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అని చెబుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. 2021-22లో 18 లక్షల 25వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి.. 57వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని అన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 15 వందల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వా్న్ని నిలదీశారు. కాళేశ్వరం అవినీతి పై పార్టీలు తమతో కలిసి పోరాడాలని షర్మిల పిలుపునిచ్చారు. కాళేశ్వరం అవినీతి పై బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మునిగిపోయిందని.. ఇదేనా మీరు చెబుతున్న మెగా ప్రాజెక్టు అంటూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై విచారణ జరపాలని షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు.