కలిసి పోరాడుదాం.. ప్రతిపక్ష పార్టీలకు షర్మిల లేఖ

కలిసి పోరాడుదాం.. ప్రతిపక్ష పార్టీలకు షర్మిల లేఖ

తెలంగాణలోని ప్రతిపక్షాలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు.  నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జనసమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ,సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్  లతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని లేఖలో కోరారు.  నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వచ్చిందన్నారు.. సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు షర్మిల. 1200మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తేల్చి చెబితే, KCR మాత్రం 80వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారని.. అవి కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

TSPSC   ప్రశ్నాపత్రాలు అమ్మే సంస్థగా మారిందని ఆరోపించారు షర్మిల..30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను బలి చేస్తూ..  ఉద్యోగాలను సంతలో సరుకుల్లా అమ్ముకొంటున్నారని.. దీనికి బాధ్యత వహించాల్సిన సర్కారు  మన్ను తిన్న పాము లాగా తప్పించుకుంటుందని ధ్వజమెత్తారు షర్మిల.