టీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారిన్రు:షర్మిల 

టీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారిన్రు:షర్మిల 

టీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారిపోయి తమపై దాడులు చేశారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడితే దాడులు చేస్తారా..? అని నిలదీశారు. టీఆర్ఎస్ కు ప్రజలు ఏమైనా రాష్ట్రాన్ని రాసిచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బందిపొట్ల రాష్ట్ర సమితిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్  కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేయడం తెలంగాణ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. 

ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని షర్మిల ఆరోపించారు. తెలంగాణలో అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తుంటే..ప్రజల పక్షాన వైఎస్ఆర్ టీపీ మాత్రమే నిలబడి పోరాటం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.  ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేకనే తమపై  దాడి చేశారన్నారు. రాష్ట్రంలో న్యాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.  సీఎం కేసిఆర్  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారన్నారు. 

కొంతమంది వ్యక్తులు వచ్చి తమపై దాడి చేసి..బస్సును తగలబెట్టినా పోలీసులు అడ్డుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. బెదిరింపులు, దాడులు చేసినా భయపడకుండా పాదయాత్ర చేస్తున్నానన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం తప్పా..? అని నిలదీశారు. తనను ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ లో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పు ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆమె పెదవుకు, డవడకు స్వల్ప గాయాలయ్యాయి. షర్మిలకు గాయాలైన ఫొటోను వైఎస్సార్టీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లోటస్ పాండ్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల..పాదయాత్ర పున ప్రారంభంపై సమాధానం చెప్పలేదు. 

నర్సంపేట్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో  లంచ్ బ్రేక్ లో కాన్వాయ్ లోని  బస్ ను టీఆర్ఎస్ అనుచరులు తగలబెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు.  పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్ లోని ఒక బస్సుకు నిప్పు పెట్టారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు