
ప్రాణం పెట్టి ఆడాం
2002 నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్‌పై యువరాజ్
అసలే కొత్త వాతావరణం.. ఆపై ఇద్దరూ జూనియర్లే.. ఇంగ్లిష్ పిచ్‌లపై ఎక్కువగా ఆడిన ఎక్స్‌పీరియెన్స్ కూడా లేదు.. ప్రత్యర్థిని చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.. దీనికితోడు వరుసగా తొమ్మిది ఫైనల్లో ఓడిన ఒత్తిడి.. ఎదురుగా చూస్తే భారీ టార్గెట్..! 18 ఏళ్ల కిందట.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్.. చూపిన తెగువ, తెగింపు.. ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది..! లార్డ్స్‌లో ఆనాడు జరిగిన ఫైనల్‌కు సంబంధించిన జ్ఞాపకాలను యువీ, కైఫ్ మరోసారి గుర్తు చేసుకున్నారు..!!
న్యూఢిల్లీ: గెలుస్తామని ఆశ లేకపోయినా.. విజయమే లక్ష్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో టీమ్ మొత్తం ప్రాణం పెట్టి ఆడిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. సీనియర్లు విఫలమైనా.. తమకు ఎక్స్‌పీరియెన్స్ లేకపోయినా.. విజయం కోసమే తాము పోరాడామన్నాడు. కుర్రాళ్ల విలువ పెంచిన ఆ పోరాటమే టీమిండియా బలమైన ఫ్యూచర్‌కు పునాదులు వేసిందన్నాడు. సోమవారంతో 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యువీ, కైఫ్ ఆనాటి ఫైనల్ను గుర్తు చేసుకున్నారు. ‘2002 నాట్వెస్ట్ ఫైనల్. టీమ్ అంతా ప్రాణం పెట్టి ఆడింది. అప్పుడు మేమంతా కుర్రాళ్లం. అందరిలోనూ గెలవాలనే కసి ఉంది. ఎవరూ ఊహించని విధంగా జట్టుగా పోరాడాం. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి ట్రోఫీని అందుకున్నాం’ అని యువీ ట్వీట్ చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ను ట్యాగ్ చేశాడు. ‘ఒక వేళ నువ్వు మర్చిపోయి ఉంటే..’ అని హుస్సేన్‌ను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీనికి నాసిర్ కూడా హుందాగా స్పందించాడు. ‘కొన్ని లవ్లీ ఫొటోలు మిత్రమా.. షేర్ చేసినందుకు థ్యాంక్స్’ అంటూ బదులిచ్చాడు. 326 రన్స్ టార్గెట్ ఛేజ్‌లో ఇండియా 24 ఓవర్లకే 146/5 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే యువీ (69), కైఫ్ (87 నాటౌట్)… 18 ఓవర్లలో 121 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పారు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన కైఫ్.. చివరి వరకు క్రీజులో ఉండి విలువైన భాగస్వామ్యాలతో మరో మూడు బాల్స్ మిగిలి ఉండగానే చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
దాదా షర్ట్ విప్పేశాడు..
అంతకుముందు వరుసగా జరిగిన తొమ్మిది ఫైనల్స్లో ఇండియా ఓడటంతో.. కెప్టెన్‌గా గంగూలీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు ఇండియా టూర్‌కు వచ్చిన ఇంగ్లండ్ సిరీస్ గెలవడంతో.. ఫ్లింటాఫ్ షర్ట్ విప్పేసి వాంఖడే మొత్తం పరుగులు పెట్టాడు. దీంతో దాదాలో ఆత్మ గౌరవ పోరాటం మొదలైంది. బయటకు కనిపించకపోయినా.. చాలా రోజులు ఈ విషయంలో నలిగిపోయిన దాదా.. కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టగానే లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి గిరిగిరా గాల్లోకి తిప్పుతూ తన కసి చూపెట్టాడు. ఈ చొక్కా విప్పిన సందర్భాన్ని ప్రముఖ వ్యాఖ్యాత జెఫ్రీ బాయ్‌కాట్‌తో పంచుకుంటూ.. ‘ఇంటర్నేషనల్ క్రికెట్‌కు లార్డ్స్.. మక్కా అయితే, ఇండియన్ క్రికెట్‌కు వాంఖడే.. లార్డ్స్‌లాంటిదని’ దాదా అన్న మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలించాయి.
ఎవరెస్ట్‌ఎక్కేశాం..
ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కైఫ్ కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. ‘జులై 13, 2002. లార్డ్స్ లో మేం ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన రోజు. దాదాకు షర్ట్‌లేదు…యువీకి అదురు లేదు.. జహీర్ ఇచ్చిన సపోర్ట్‌కు వెలలేదు.. నాకు భయం లేదు.. జ్ఞా పకాలకు అంతేలేదు..’ అంటూకైఫ్ ట్వీట్‌చేశాడు.