శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’

శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ప్రతి షాపులో శానిటైజర్, టెంపరేచర్ చెకింగ్ తప్పనిసరి చేశారు. అందుకోసం దుకాణ యజమానులు ప్రత్యేకంగా ఒక మనిషిని కూడా పెడుతున్నారు. అయితే తమిళనాడులోని ఒక బట్టల షాపు యజమాని దీనికి భిన్నంగా ఆలోచించాడు. తన షాపుకు వచ్చే కస్టమర్లకు శానిటైజర్ ఇచ్చి, టెంపరేచర్ చెక్ చేయడానికి మనిషిని కాకుండా.. ఒక రోబోను ఏర్పాటు చేయించాడు.

తిరుచిరపల్లిలోని ఒక బట్టల షాపు వ్యాపారి తన షాపులో ‘జఫిరా’ అనే హ్యూమనాయిడ్ రోబోను ఏర్పాటు చేయించాడు. ఇది చూడటానికి అచ్చం అమ్మాయిలాగే ఉంటుంది. ‘జఫిరా’ షాపులోకి వచ్చే కస్టమర్లను ట్రాక్ చేస్తుంది. వారు సామాజిక దూరాన్ని పాటించేలా సూచనలిస్తుంది. మాస్కులు పెట్టుకోకపోతే లోనికి రానివ్వదు. అలాగే కస్టమర్ల టెంపరేచర్ చెక్ చేసి.. వారికి శానిటైజర్ కూడా అందిస్తుంది.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి తాము ఈ ‘జఫిరా’రోబోట్లను తయారుచేస్తున్నామని జఫీ రోబోట్స్ సీఈవో ఆశిక్ రెహ్మాన్ తెలిపారు. ‘ ఈ జఫిరా ఫ్రంట్‌లైన్ కార్మికులకు చాలా సహాయపడుతుంది. ఈ రోబోట్ పూర్తి ఇంటెలిజెన్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది దుకాణంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్యను ట్రాక్ చేసి.. ఆ వివరాలను ప్రతిరోజూ మెయిల్ ద్వారా యజమానులకు పంపుతుంది. వాయిస్-యాక్టివేటెడ్ రోబోట్ అయిన ‘జఫిరా’ ను వివిధ దుస్తులలో ఏర్పాటుచేసుకోవచ్చు. తిరుచిరపల్లిలో దాదాపు అన్ని వస్త్ర దుకాణాల్లో ‘జఫిరా’ను ఉపయోగిస్తున్నారు’ అని ఆశిక్ రెహ్మాన్ తెలిపారు.

‘జఫిరా’ సక్సెస్ కావడంతో తమిళనాడు, కేరళలోని వివిధ షోరూమ్‌ల నుంచి భారీగా ఆర్డర్‌లు వస్తున్నాయని ఆశిక్ తెలిపారు. అందువల్ల తాము ‘జఫిరా’ను భారీగా ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

For More News..

దేశంలో ఒక్కరోజే 75,760 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా