
ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. వరుసగా టెస్టు సిరీస్, టీ20 ట్రోఫీలను దక్కించుకొని ఉత్సాహం మీదున్న భారత్.. ఇంగ్లీష్ జట్టును మరోమారు చిత్తు చేయడానికి రెడీ అవుతోంది. టీ20 సిరీస్‌లో సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ తమ ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు. అయితే బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ ప్రతిభను కొట్టిపారేయలేనిది. అందుకే అతడి పెర్ఫామెన్స్‌పై జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు కనిపించని హీరో అంటూ కొనియాడాడు.
‘భారత క్రికెట్ టీమ్‌లో పెద్ద ప్లేయర్లు ఉండొచ్చు. కానీ శార్దూల్ ఠాకూర్ ఓ కనిపించని హీరో. అతడు తనకు అప్పగించిన పనిని నిర్వర్తిస్తున్నాడు. ఈ ట్రోఫీలో అతడిదీ కీలక పాత్రే. ఓ టాప్ ప్లేయర్‌లా అతడు పెర్ఫామ్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి శార్దూల్‌లో చాలా తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా అతడి బాడీ లాంగ్వేజ్ మారింది. అతడిలో మునుపటి కంటే ఎక్కువగా విశ్వాసం తొణికిసలాడుతోంది’ అని జహీర్ ఖాన్ చెప్పాడు.