తొలిసారి యూకేను సందర్శించనున్నఉక్రెయిన్ అధ్యక్షుడు

తొలిసారి యూకేను సందర్శించనున్నఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ సడెన్ గా యూకే పర్యటన చేపట్టనున్నారు. రష్యా,- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జెలెన్ స్కీ యూకే రావడం ఇదే మొదటిసారి. దీంతో ఆయన పర్యటనపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో జెలెన్ స్కీ, యూకే ప్రధాని రిషి సునక్‌తో సమావేశవుతారని, ఆ తర్వాత పార్లమెంటులో ప్రసంగిస్తారని యూకే ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్ కు మద్దతిస్తోన్న  అతిపెద్ద సైనిక దేశాలలో యూకే ఒకటి. అందులో భాగంగానే ఆ దేశానికి 2 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ విలువ గల ఆయుధాలు, సామాగ్రిని పంపించింది.

దాంతో పాటు ఫైటర్ జెట్ పైలట్‌లు, మెరైన్‌లను ఆపరేట్ చేయడానికి ఉక్రేనియన్ దళాలకు బ్రిటిష్ శిక్షణను కూడా ప్రకటించింది. ఈ శిక్షణా కేంద్రాలను జెలెన్ స్కీ సందర్శించనున్నారు. భవిష్యత్తులో నాటో-స్టాండర్డ్ ఫైటర్ జెట్‌లను నడిపేందుకు ఉక్రేనియన్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా యూకే ప్రకటించింది. UK ఇప్పటికే ఛాలెంజర్ 2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపే ప్రణాళికలను ప్రకటించింది. ఇక రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దండయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ పెద్దగా విదేశీ పర్యటనలేమీ చేయలేదు. కానీ గతేడాది డిసెంబర్ మాత్రం అమెరికాను సందర్శించారు. ఇప్పుడు యూకేలో పర్యటిస్తే.. ఇది రెండో పర్యటన అవుతుంది.