జింబాబ్వే క్రికెటర్కు ఐసీసీ అవార్డు

జింబాబ్వే క్రికెటర్కు ఐసీసీ అవార్డు

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తొలిసారిగా జింబాబ్వే ప్లేయర్ దక్కించుకున్నాడు. ఆగస్టు నెలకు గానూ..ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సికిందర్ రజా గెలుచుకున్నాడు. ఈ అవార్డు రేసులో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్లు ఉండగా..వారిద్దరిని ఓడించి..సికిందర్ రజా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 

గర్వంగా ఉంది..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం సంతోషంగా ఉందని సికిందర్ రజా అన్నాడు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. జట్టు టెక్నికల్ స్టాఫ్‌, సహచర ప్లేయర్లు, సపోర్ట్ టీమ్కు ధన్యవాదాలు తెలిపాడు. వీరిందరి సపోర్ట్ వల్లే అవార్డు దక్కిందని చెప్పుకొచ్చాడు. తనను ప్రోత్సహించే జింబాబ్వే అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను...అని  అతను పేర్కొన్నాడు.

ఆగస్టులో మూడు సెంచరీలు..
36ఏళ్ల సికిందర్ రజా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌పై తొలి సెంచరీ (135)  చేశాడు. 304 పరుగుల టార్గెట్లో భాగంగా రజా..ఇన్నోసెంట్ కాయతో కలిసి నాల్గవ వికెట్‌కు కీలకమైన 192పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే సెంచరీ చేసి..బంగ్లాదేశ్పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మ్యాచ్లోనూ 127బంతుల్లో 117నాటౌట్‌తో తన ఫామ్‌ను కొనసాగించాడు. టీమిండియాతో జరిగిన చివరి వన్డేలోనూ సెంచరీలో చెలరేగాడు. 115పరుగులు చేసి..జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. భారత బౌలర్ల విజృంభణతో చివరికి జింబాబ్వే 13పరుగుల తేడాతో ఓటమిపాలయింది.