జొమాటో బాదుడు​: లాంగ్​ డిస్టెన్స్ .. సర్వీస్​ చార్జ్​...

జొమాటో బాదుడు​:  లాంగ్​ డిస్టెన్స్ .. సర్వీస్​ చార్జ్​...

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో  కస్టమర్లకు  షాకిచ్చింది.  కొత్తగా లాంగ్​ డిస్టెన్స్​ పేరుతో సర్వీస్​ చార్జ్​ వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకొంది.  జోమాటో ఆదాయాన్ని పెంచుకొనేందుకు  కొత్త ఛార్జీల బాదుడు మొదలు పెట్టింది. దూరానికి అనుగుణంగా లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు ను ప్రారంభించింది. 

 దూరంగా ఉన్న హోటల్స్​... రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. 4 కిలోమీటర్ల దాటి ఉన్న రెస్టారెంట్ ల  నుంచి పెట్టే ఆర్డర్లకు జొమాటో లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు వర్తిస్తుంది. రెస్టారెంట్....  డెలివరీ అడ్రస్‌ మధ్య దూరం 4 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉండి...  ఆర్డర్‌ విలువ రూ.150 దాటితే కస్టమర్ల నుంచి  రూ.15 సర్వీస్​ చార్జ్​ చేయనున్నారు.  6 కిలోమీటర్లు దాటితే ఆర్డర్‌ విలువతో సంబంధం లేకుండా  ఏరియాను బట్టి సర్వీస్‌ ఛార్జి రూ.25 నుంచి రూ.35 వరకు ఉంటుంది.

కొవిడ్‌ 19 విజృంభనకు ముందు జొమాటో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి ఛార్జీలు విధించేది కాదు. మహమ్మారి తర్వాత అనేక రెస్టారంట్లు  మూతపడిన సమయంలో .. ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది. 

 డిస్టెన్స్‌ ఛార్జీ, సర్వీసు ఛార్జీ ఆర్డర్‌ విలువకు 30 శాతం మించకుండా చూసుకోవాలని రెస్టారంట్‌ పార్టనర్‌లకు జొమాటో సూచించింది.  దీని వల్ల జొమాటోకు చెల్లించే కమీషన్ పెరుగుతుందని కొన్ని రెస్టారెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. కానీ ఇతర ఖర్చులతో కలుపుకొని ఈ కమీషన్ 45 శాతానికి చేరుకుంటుందని రెస్టారెంట్ యజమానులు చెప్తున్నారు. సమీప దూరంలో ఉన్న కస్టమర్లు ఇచ్చిన రేటింగ్స్‌ను బట్టి ఈ సర్వీస్ ఫీజు నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో వర్గాలు చెప్తున్నాయి. 

కస్టమర్లు తమకు దగ్గరలోని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు ఇచ్చేందుకే సర్వీస్​ చార్జ్​ ను ప్రవేశపెట్టిందని  రెస్టారెంట్​ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జొమాటో తన క్విక్‌ కామర్స్‌ విభాగమైన బ్లింకిట్‌పై పెద్దఎత్తున ఖర్చు చేస్తోంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే  నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.