రూపాయికే జొమాటో షేర్.. ఎందుకంటే ?

రూపాయికే జొమాటో షేర్.. ఎందుకంటే ?

జొమాటో  సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు ఒక్క రూపాయికే 4.6 కోట్ల కంపెనీ షేర్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈవిషయాన్ని స్టాక్ మార్కెట్లకు కూడా నివేదించింది. ఉద్యోగులకు స్టాక్స్ కేటాయించే ప్రతిపాదనకు జొమాటో డైరెక్టర్ల బోర్డులోని నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ జులై 25న ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఒక్కో ఉద్యోగికి రూపాయి ఫేస్ వ్యాల్యూతో 4.6 కోట్ల షేర్లను కేటాయించేందుకు జొమాటో దాదాపు రూ.4.66 కోట్లకుపైగా వెచ్చించనుంది. వాస్తవానికి ప్రస్తుత రేటు (రూ.43.85)  ప్రకారం 4.6 కోట్ల జొమాటో షేర్లకు రూ.188.75 కోట్లు అవుతుంది. అంటే ఏకంగా 98 శాతం రాయితీపై ఉద్యోగులకు జొమాటో షేర్లను అలాట్ చేస్తోందన్న మాట.  

613 కోట్ల షేర్ల లాక్ ఇన్ ముగియడంతో..

జొమాటోలో దాదాపు 78 శాతం  వాటాకు సమానమైన 613 కోట్ల షేర్లను కలిగిన  ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారుల ఒక ఏడాది లాక్ ఇన్ పీరియడ్  జులై 23న ముగిసినప్పటి నుంచి అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా  గత రెండు రోజుల్లో షేరు 23 శాతం పతనమైంది.  ఈవిధంగా జరుగుతున్న షేరు పతనాన్ని అడ్డుకునేందుకే ఉద్యోగులకు ఇంత చౌకగా షేర్లను కేటాయిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో జొమాటో కంపెనీ షేర్లు లిస్ట్ అయి ఇటీవల సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ వ్యవధిలో జొమాటో షేరు ధర ఏకంగా నాలుగో వంతుకు పడిపోయింది.  జొమాటో షేరు ధర 2021 జులై 28న రూ.131..  ప్రస్తుతం (ఏడాది తర్వాత ) ఇది రూ.43.95.  లిస్టింగ్ అయిన  కొత్తలో ఒకానొక దశలో జొమాటో షేరు ధర  గరిష్ఠంగా రూ.169.10కి చేరింది.