భద్రాచలం, వెలుగు: గిరిజన గురుకుల బాలికల 6వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మెగా చాంపియన్ గా జోన్- 3 నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో నాలుగు రోజులుగా నిర్వహించిన పోటీలు మంగళవారంతో ముగిశాయి. గేమ్స్ అండర్- 19, 17, 14 చాంపియన్ షిప్ కూడా జోన్ -3కే లభించింది.
అథ్లెటిక్స్ వ్యక్తిగత చాంపియన్షిప్అండర్ 14లో ఇందు(భద్రాచలం), అండర్ 17 విభాగంలో తేజశ్రీ (భద్రాచలం), అండర్ 19 విభాగంలో హరిత(ఎల్లారెడ్డిపేట) విజేతలుగా నిలిచారు. క్రీడల ముగింపు వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
