
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడూ మారిపోతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీటు దక్కని రెండు పార్టీలలోని ఆశావాహులు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. తాజాగా జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఝరాసంఘం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానిక జెడ్పీటీసీ వినీల నరేష్ .. 2023, అక్టోబర్ 18వ తేదీ బుధవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినీల నరేష్ కు హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read : రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ..ఎందుకంటే.? : కవిత
కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి వల్ల బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు వినీల నరేష్ తెలిపారు. నియోజకవర్గంతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలువడం ఖాయమని.. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి విజయం కోసం కృషి చేస్తామని జడ్పిటిసి వినీల నరేష్ తెలిపారు