సింగపూర్: అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గార్గ్‌ది హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సింగపూర్ పోలీసులు తేల్చారు. సముద్రంలో విహరించేటపుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం, లైఫ్ జాకెట్ ధరించకపోవడమే ఆయన మరణానికి కారణమయ్యాయని చెప్పారు. సముద్రంలో పడిపోయిన జుబీన్ను ఒడ్డుకు చేర్చి సీపీఆర్ అందించారని, ఆ సమయంలో జుబీన్కు గాయాలయ్యాయని చెప్పారు.
ఈమేరకు గార్గ్ మృతిపై జరిపిన దర్యాప్తు రిపోర్టును పోలీసు చీఫ్ ఇన్వెస్టిగేటర్ బుధవారం సింగపూర్ కరోనర్ కోర్టుకు అందజేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం.. గార్గ్‌ది హత్య అని చెప్పడానికి తగిన ఆధారాలేమీ లేవు. గతేడాది సెప్టెంబర్ 19న అతను లాజరస్ ఐలాండ్లో యాచ్ పార్టీలో భాగంగా సముద్రంలోకి వెళ్లారు. తొలుత లైఫ్ జాకెట్ ధరించినా.. తర్వాత తీసేశారు. సముద్రంలో స్విమ్మింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన ఫ్రెండ్స్.. వెంటనే ఆయనను యాచ్‌పైకి లాగి సీపీఆర్ చేసి హాస్పిటల్‌కు తరలించారు.
