గాంధీలో ఎలుకలు

గాంధీలో ఎలుకలు
  • ల్యాబ్​లు, కరెంట్ వైర్ల మధ్య తిరుగుతుండటంతో ఇబ్బంది

పద్మారావునగర్, వెలుగు: గాంధీ  ఆస్పత్రిలో ఎలుకల, పందికొక్కుల లొల్లి ఎక్కువైంది. రూ. కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్​మెంట్ మెషిన్లకు వీటి నుంచి ప్రమాదం ఏర్పడుతోంది. సెల్లార్, పలు వార్డుల్లో, మెడికల్​ డిపార్ట్ మెంట్ ల్యాబొరేటరీల్లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. మెడికల్ ఎక్విప్​మెంట్​లో ఏ చిన్న వైరును ఎలుకలు కొరికినా ఆ మెషీన్లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెడికల్ టెస్టులు, రిపోర్టులు, పేషెంట్లకు అందించే ఇతర సేవలపై ఇది ప్రభావం చూపుతోంది.

షార్ట్ సర్క్యూట్​తో ప్రమాదాలు

మైక్రోబయోలజీ, పెథాలజీ, బయోకెమిస్ట్రీ వంటి కీలక ల్యాబొరేటరీల్లో ఎలుకల తిరుగుతుండటంతో చాలా ఇబ్బందిగా ఉందని పలువురు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. చాలాసార్లు ఎలుకలు, పందికొక్కులు కరెంట్ వైర్లను కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్​తో​ ప్రమాదాలు కూడా జరిగి
నట్లు కొందరు సిబ్బంది చెప్తున్నారు. గత నెల 16న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా కొన్ని మెషీన్లు పనికిరాకుండా పోయాయంటున్నారు. ఎలుకలను పట్టుకోవడానికి ర్యాట్ ప్యాడ్స్​, పాయిజన్ కేక్స్​ను ల్యాబొరేటరీల్లో పెడుతున్నామంటున్నారు.

అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

మెయిన్​ బిల్డింగ్ సెల్లార్​లోని డ్రైనేజీ వ్యవస్థ  లోపాల కారణంగా మురికినీరు అక్కడే నిల్వగా ఉండటంతో ఎలుకలు, పందికొక్కులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా బాగుచేయడంతో పాటు శానిటేషన్ సిబ్బంది సంఖ్యను పెంచి, నిరంతరం  శానిటేషన్ పనులను వేగవంతం చేస్తే ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు, దోమలు, దుర్వాసన సమస్య తీరే అవకాశం ఉంది. ఇప్పటికైనా గాంధీ ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు కోరుతున్నారు.