- పాముతో కాటు వేయించి హత్య.. తమిళనాడు తిరువళ్లూరులో దారుణం
- ఇద్దరు కొడుకులు సహా ఆరుగురి అరెస్ట్
తండ్రి పేరుపై మూడు కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి పాముతో కాటు వేయించి చంపారు ఇద్దరు కొడుకులు. ఆ తర్వాత బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు. అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది. తమిళనాడులోని పొత్తతుర్పేట్టైలో ఈ దారుణం వెలుగు చూసింది.
చెన్నై: బీమా డబ్బుల కోసం సొంత తండ్రినే పాముకాటుతో చంపించారు ఇద్దరు కొడుకులు. మానవత్వానికే మచ్చ లాంటి ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని పొత్తతుర్పేట్టై గ్రామంలో చోటుచేసుకుంది. ఈపీ గణేశన్ (56) అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేసేవాడు.
అక్టోబర్ నెలలో ఆయన అకస్మాత్తుగా తన ఇంట్లో మరణించాడు. పాముకాటు వల్ల మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తండ్రి పేరిట ఉన్న పలు ఇన్సూరెన్స్ పాలసీల డబ్బులను కొడుకులు క్లెయిమ్ చేశారు. గణేశన్ వాస్తవ ఆర్థిక స్థితి కంటే అధిక విలువగల ఇన్సూరెన్స్పాలసీలు తీసుకున్న కొడుకులపై బీమా కంపెనీలు సందేహం వ్యక్తం చేశాయి.
కొడుకుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండడంతో కంపెనీల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు తిరువళ్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేకానంద శుక్లా పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ)ను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో గణేశన్ ఇద్దరు కొడుకులే ఆయనను హత్య చేసినట్టు తేలింది.
ముందస్తు ప్లాన్ ప్రకారమే వారు తండ్రి పేరుపై అధిక విలువ కలిగిన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. వాటికి వారే నామినీలుగా ఉన్నారు. హత్యను పాముకాటు ప్రమాదంగా చూపించాలని ప్లాన్ చేశారు. ముందుగా ఒక నాగు పామును తీసుకొచ్చి తండ్రి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించారు.
వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేశారు. ఈసారి అత్యంత విషపూరితమైన కట్ల పామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతని మెడపై కాటు వేయించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత వారే ఆ పామును ఇంట్లోనే చంపేశారు.
తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలనే ఆలస్యం చేశారు. నేరానికి పాల్పడిన ఇద్దరు కొడుకులతోపాటు వారికి పామును తీసుకొచ్చి ఇచ్చి, ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన నలుగురు ఫ్రెండ్స్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
