మల్టీ స్కిల్స్‌‌ ఉంటేనే.. మస్తు ఆఫర్లు..కొలువుల వేటలో నైపుణ్యమే ప్రధానం :మంత్రి వివేక్

మల్టీ స్కిల్స్‌‌ ఉంటేనే.. మస్తు ఆఫర్లు..కొలువుల వేటలో నైపుణ్యమే ప్రధానం :మంత్రి వివేక్
  •     దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 115 అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు
  •     3 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ అడుగులు
  •     ఇండియా స్కిల్స్‌‌-2025 పోటీల ముగింపులో కార్మిక శాఖ మంత్రి 
  •     విజేతలకు రూ. 10 వేలు, రన్నరప్‌‌లకు రూ. 5 వేల క్యాష్ ప్రైజ్​ అందజేత

హైదరాబాద్, వెలుగు: నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని.. చేతిలో నైపుణ్యం కూడా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. యువత ఒకే పనికి పరిమితం కాకుండా, మల్టీ స్కిల్స్ సాధించినప్పుడే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా దొరుకుతాయన్నారు. చదువుతో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్, సాఫ్ట్‌‌ స్కిల్స్‌‌ మెరుగుపర్చుకుంటేనే సక్సెస్‌‌ సాధ్యమని సూచించారు. ఇండియా స్కిల్స్‌‌–2025 పోటీల ముగింపు కార్యక్రమం శనివారం హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్‌‌.. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి, మాట్లాడారు. ఇండియా స్కిల్ కాంపిటీషన్ యువతకు ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని, స్కిల్స్‌‌ను మెరుగుపర్చుకునేందుకు ఇదొక చక్కటి వేదిక అని తెలిపారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకూడదని యువతకు సూచించారు. ప్రయత్నం చేస్తుంటేనే విజయం వరిస్తుందని, తల్లిదండ్రులు గర్వపడేలా యువత ఎదగాలని ఆకాంక్షించారు. 

చదువు వేరు.. పని వేరు: దాన కిశోర్‌‌ 

ప్రస్తుత మన విద్యా వ్యవస్థ బ్రిటిష్ వారసత్వం నుంచి వచ్చిందని, దీనివల్ల మనం కాలేజీలో చదివిన చదువుకు, బయట చేస్తున్న పనికి పొంతన ఉండటం లేదని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ అన్నారు. ఈ గ్యాప్‌‌ను 'స్కిల్లింగ్' మాత్రమే పూరిస్తుందన్నారు. ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ, మెషినరీ శరవేగంగా దూసుకుపోతున్నాయని, పాత స్కిల్స్‌‌తో మనం ఇప్పుడు నెట్టుకు రాలేమన్నారు. ఇప్పుడు 'రీ–స్కిల్లింగ్' అత్యవసరమని నొక్కి చెప్పారు. ఇండియా స్కిల్ 2025 కోసం జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించి, 40 విభాగాల్లో 240 మంది అత్యుత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. రీజినల్ లెవల్ పోటీలు కూడా మన దగ్గరే జరిగే అవకాశం ఉందన్నారు. 

115 ఏటీసీలు.. రాష్ట్రానికే తలమానికం

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ తెలిపారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే 115 అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను స్థాపిస్తున్నాం. ఇండస్ట్రీలకు ఏ స్కిల్స్ అవసరమో గుర్తించి, దానికి అనుగుణంగా కోర్సులను డిజైన్ చేస్తున్నాం. యువత ఈ సెంటర్ల ద్వారా కొత్త కోర్సులను నేర్చుకుని భవిష్యత్తును బంగారం చేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. ప్రధాని మోదీ దేశాన్ని 
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని చెబుతుంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పని చేస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ. 10 వేలు, రన్నరప్ లకు రూ. 5 వేల చొప్పున రివార్డులను ఈ కార్యక్రమంలో దాన కిశోర్ తో కలిసి మంత్రి వివేక్ అందజేశారు.