ఆధ్యాత్మికం: ఇవి ఉంటే జీవితం పాశనమే..ఈ మూడు దోషాలను వదిలిపెట్టండి..!

ఆధ్యాత్మికం: ఇవి ఉంటే జీవితం పాశనమే..ఈ మూడు దోషాలను వదిలిపెట్టండి..!

పరస్వానాం చ హరణం పరదారాభిమర్శనమ్‌‌ 
సుహృదామతి శంకా చ త్రయో దోషాః క్షయామహాః 
మహర్షీణాం వధో ఘోరః సర్వదేవైశ్చ విగ్రహః 
అభిమానశ్చ కోపశ్చ వైరిత్వం ప్రతికూలతా

పరుల ధనమును హరించుట, పర భార్యలను స్పృశించుట, మంచి హృదయము గలవారిని ఎక్కువ శంకించుట... ఈ మూడు దోషములు వినాశనమును కలిగిస్తాయి. అలాగే మహర్షులను క్రూరముగా చంపివేయుట, దేవతలందరితోను విరోధము, అహంకారము, రోషము, శత్రుత్వము, ప్రతికూలత్వము..... ఈ దోషాలన్నీ జీవితాన్ని నశింపచేస్తాయి. ఈ లక్షణాలు నా సోదరుడైన రావణుడి సంస్కారాన్ని కప్పివేశాయి .. అని విభీషణుడు ఇంద్రజిత్తుతో పలికాడు.

 (రామాయణం, యుద్ధకాండ, 87వ సర్గ, 23 మరియు 24 శ్లోకాలు) ధర్మార్థకామమోక్షాలు అనేవి నాలుగు పురుషార్థాలని భారతీయ సంప్రదాయం చెబుతోంది. ఇందులో ముందుగా ధర్మం గురించి చెప్పి, చివరగా మోక్షాన్ని ప్రస్తావించారు. అర్థకామాదులను మధ్యలో బంధించారు. అంటే ఆ రెండింటినీ ధర్మబద్ధంగా సంపాదించాలే కాని అధర్మంగా సంపాదించకూడదని చెబుతున్నారు. అప్పుడు మోక్షం అనేది ఎటువంటి ప్రయత్నమూ చేయకుండానే లభిస్తుందని అర్థం. 

ధన సంపాదన గురించి ‘స్వార్జితం ఉత్తమం’ అని చెప్పారు. మనకు కావలసిన ధనాన్ని మనం కష్టపడి ధర్మ మార్గంలో సంపాదించుకుంటే అది ఉత్తమమని అర్థం. పరుల ధనాన్ని హరించటం అనే దోషం వినాశనానికి కారణం అవుతుంది.

మహాభారతంలో ..పాండవులు రాజసూయ యాగం చేసిన సందర్భంగా సకల దేశాల రాజులు ఆ యాగానికి కానుకలుగా వెలలేని సంపదలను సమర్పించారు. వాటిని చూసిన దుర్యోధనుడికి ఈర్ష్య, అసూయ, దురాశ కలిగాయి. ఎలాగైనా వారి ధనాన్ని దోచుకోవాలనుకున్నారు. ధర్మరాజుని జూదానికి పిలిచారు. శకుని ద్వారా ఆడిన మాయా జూదంలో ధర్మరాజు సర్వం కోల్పోయాడు. కౌరవాదులు అక్రమంగా పొందిన ధనంతో పదమూడు సంవత్సరాలు భోగాలన్నీ అనుభవించారు. తరువాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. పరుల ధనాన్ని ఆశించి వంశ నాశనానికి కారకులయ్యారు.

►ALSO READ | జ్యోతిష్యం: ఇంటి ముందు రంగోలి ముగ్గులు ... గ్రహదోషనివారణ .. నెగిటివ్ ఎనర్జీ దూరం !

మరో దోషం .. పర భార్యలను స్పృశించుట, రామాయణంలో రావణుడు పరస్త్రీ అయిన సీతమ్మను సాధువు వేషంలో వచ్చి అపహరించి, లంకలో బంధించాడు. వానరుల సహాయంతో రాముడు వారధి నిర్మించి, లంక చేరి, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తు... మొదలైన రాక్షసులను సంహరించి సీతమ్మను చేపట్టి, అయోధ్యకు వచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు. రామాయణంలోనే.. పరస్త్రీని చెరపట్టిన మరొకడు వాలి. తమ్ముడైన సుగ్రీవుని భార్య రుమను చెరపట్టి, సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. రాముని సహాయంతో సుగ్రీవుడు వాలిని సంహారం చేసి, రుమను తిరిగి పొందాడు. అలా పర స్త్రీని స్పృశించి, మహాబలశాలి అయిన వాలి మరణించాడు. 

మంచి హృదయము గలవారిని ఎక్కువ శంకించుట... అనేది మరో దోషం. సహృదయులను ఆత్మీయులుగా భావించాలి. వారితో స్నేహంగా మెలగాలి. వారిని అనుమానించటం వలన ఆపదలు తప్పవని రామాయణమే చెబుతోంది. అరణ్యవాసం సమయంలో ఒకనాడు రాముడు బంగారు లేడిని వేటాడుతూ దూరంగా వెళ్లిపోయాడు. అదంతా మారీచుని మాయ. రాముడు ఆ లేడిని బాణంతో కొట్టగానే మారీచుడు తన రూపాన్ని ధరించి, ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని రాముని కంఠ స్వరంతో బిగ్గరగా అరిచాడు. ఆ గొంతు రామునిదేనని భావించిన సీతమ్మ, ‘లక్ష్మణా! మీ అన్నగారు ఆపదలో ఉన్నారు. వెళ్లి కాపాడు’ అని పలికింది. 

అందుకు లక్ష్మణుడు నవ్వుతూ, ‘అమ్మా! అదంతా రాక్షసమాయ. అన్నగారికి ఎటువంటి ఆపద సంభవించలేదు’ అని వినయంగా పలికాడు. సీతమ్మ ఆవేశంతో, ‘లక్ష్మణా! నీ అన్నగారు లేకపోతే, నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు’ అంటూ లక్ష్మణుడిని శంకిస్తూ పరుషంగా మాట్లాడింది. ఆ మాటలను తట్టుకోలేక రాముడు వెళ్లిన దిక్కుగా లక్ష్మణుడు వెళ్లాడు. తక్షణమే రావణుడు వచ్చి సీతమ్మను అపహరించాడు. లంకలో సీతమ్మ అష్టకష్టాలు పడింది. 

మంచి హృదయం గల లక్ష్మణుడిని శంకించటం వల్లే సీతమ్మ కష్టాలు పడవలసి వచ్చింది. మానవులను సన్మార్గంలో నడిపించడానికి మహర్షులు ఇటువంటి సూక్తులను రామాయణభారతాల ద్వారా మానవజాతికి అందించారు. ఇటువంటి దుర్గుణాలను అనుసరిస్తే కష్టాలపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

 -డా. పురాణపండ వైజయంతి–