చారిత్రక, సాంస్కృతిక అంశాలతో ‘భద్రాద్రి’ మాస్టర్ప్లాన్ 

చారిత్రక, సాంస్కృతిక అంశాలతో ‘భద్రాద్రి’ మాస్టర్ప్లాన్ 
  • మాడవీధుల్లో పర్యటించిన కలెక్టర్, ఆర్కిటెక్, స్తపతి
  • పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చిన ఆర్కిటెక్​ 
  • వైదిక బృందం సూచనలు, సలహాల మేరకు తుదిరూపు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం మాస్టర్​ ప్లాన్​ తుదిరూపు దిద్దుకుంటోంది. చారిత్రక, సాంస్కృతిక అంశాలతో మాస్టర్​ ప్లాన్​ను రూపొందిస్తున్నారు. స్తపతి వల్లినాయగన్, ఆర్కిటెక్​ సూర్యనారాయణ వివిధ దశల్లో భద్రాచలంలో పర్యటించి డిజిటల్, డ్రోన్ల సాయంతో తీసిన ఫొటోల ఆధారంగా తయారు చేసిన పనుల వివరాలను బుధవారం భద్రాచలంలో వైదిక కమిటీ ముందు ఉంచారు.

కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​కు పవర్​ పాయింట్​ప్రజంటేషన్ ద్వారా ఆర్కిటెక్​ సూర్యనారాయణ మాస్టర్​ ప్లాన్​ గురించి వివరించారు. రామాలయంతో పాటు భద్రాచలం పట్టణం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ప్లాన్​ తయారు చేశారు. కలెక్టర్ కు కూడా ఇది నచ్చింది. అయితే వైదిక బృందం సూచనలు, సలహాలతో ఆగమశాస్త్రం ప్రకారం మార్పులు, చేర్పులు చేసి తుది మాస్టర్​ ప్లాన్​ను తయారు  చేయనున్నారు. 

ఆలయం చుట్టూ పరిశీలన.. 

రామాలయం చుట్టూ కలెక్టర్, స్తపతి, ఆర్కిటెక్​ ఆఫీసర్లతో కలిసి తిరిగారు. ఇప్పటికే రూ.34కోట్లతో ఆలయం చుట్టూ ఉన్న 47 ఇండ్లను తొలగించి ఎకరానికి పైగా స్థలాన్ని సేకరించారు. వాస్తుతో పాటు ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టాలో అన్నీ పరిశీలించారు. కొత్త నిర్మాణాలు మాత్రమే కాకుండా భద్రాచలం పట్టణం మొత్తం ఆధ్యాత్మిక శోభ ఉండేలా అభివృద్ధి పనులు చేపడతారు. దక్షిణం వైపు అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్, దక్షిణం పెంచడం, ఉత్తర ద్వారం కూడా మార్పులు, చేర్పులు చేయడం, చిత్రకూట మండపం పునర్నిర్మాణం, నాలుగు వైపులా భక్తుల కోసం కాలినడక మండపం నిర్మాణం, ప్రసాదాల తయారీ కేంద్రం వంటశాల, చారిత్రక, ప్రాచీతలను కాపాడుకుంటూ నవీకరించడం మాస్టర్ ప్లాన్​ ఉద్దేశ్యంగా వారు వివరించారు. నమూనా ప్రకారం అన్ని పనులకు అవసరమయ్యే నిధులతో కూడిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 

రామయ్య భూములను రక్షించుకుందాం

ఇదే సమయంలో ఆంధ్రాలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములను రక్షించుకుందామని కలెక్టర్​ తెలిపారు. సబ్​ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ఠ, ఈవో రమాదేవితో పాటు అర్చకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. చిత్రకూట మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆలయాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, మాస్టర్​ ప్లాన్​ రూపకల్పన, రామాలయ భూముల రక్షణపై కీలకంగా చర్చించారు.