
- నవ్విస్తూ తొందరగా కోలుకునేలా చేస్తున్న ఆర్గనైజేషన్
- ఢిల్లీ ఆస్పత్రులకు చిరపరిచితం ‘క్లౌన్ సెల్లర్స్’
రోజులో ఒక్కసారైనా నవ్వకపోతే ఆ రోజు వేస్ట్ అంటాడు చార్లీ చాప్లిన్. మన లైఫ్లో నవ్వుకు అంత ప్రయారిటీ ఉంది. మనసు హాయిగా ఉండాలన్నా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికైనా నవ్వుకు మించింది లేదంటోంది ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్. హాస్పిటల్స్లో ఉన్న చిన్న పిల్లలను నవ్విస్తూ తొందరగా కోలుకునేలా చేస్తోంది. అందుకు ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తోంది.
ఢిల్లీలోని కొన్ని హాస్పిటల్స్లో ‘క్లౌన్ సెలర్స్’ అంటే చాలామందికి తెలుసు. శీతల్ ఆగర్వాల్ ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ అది. ఆస్పత్రుల్లో ఉన్న వాళ్లకు నవ్వుల్ని పంచుతూ వాళ్ల హెల్త్ మెరుగుపడేలా ప్రయత్నిస్తోందామె. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న పిల్లలను ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఆమెది. అందుకోసం ఆమె ప్రత్యేకంగా రెడీ అవుతుంది. తలకు రంగురంగుల విగ్ పెట్టుకుంటుంది. ఎరుపు రంగు బంతిని ముక్కుకు తగిలించుకొని పిల్లల్ని రిలాక్స్ చేస్తుంది. ట్రీట్మెంట్ చేశాక డాక్టర్ వెళ్లిపోతాడు. అప్పుడు పిల్లలు భయపడే అవకాశం ఉంది. అందుకని ఆ టైంలో వాళ్లను ఎంటర్టైన్ చేస్తే వాళ్లు త్వరగా కోలుకొనే వీలుంటుంది.
శీతల్లెక్చరర్ గా పని చేస్తోంది. సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2016లో ఆమె ‘మెడికల్ క్లౌన్’ గురించి చదివింది. అప్పటి నుంచి ‘మెడికల్ క్లౌన్’ మొదలుపెట్టింది. దీని కోసం ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంది. ఆ తర్వాత వలంటీర్ల కోసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దానికి 33 మంది ఇంట్రెస్ట్ చూపారు. వాళ్లకు మెడికల్ క్లౌన్ గురించి చెప్పి, ఆస్పత్రులకు తీసుకెళ్లింది. వీళ్లంతా ఆస్పత్రికి వెళ్లగానే పిల్లల మొఖాల్లో చిరునవ్వులు పూస్తాయి. ‘వారమంతా నవ్వని పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా నవ్వడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను’ అంటుంది శీతల్. పిల్లలకు కావాల్సిన బొమ్మలు, ఆట వస్తువులు ఇచ్చి వాళ్లను ఆడించడం, వాళ్లకు నవ్వు తెప్పించే యాక్టివిటీస్ చేయడం, ప్రత్యేకంగా వాళ్లను ఎంగేజ్ చేయడం ద్వారా పిల్లల ఫీలింగ్స్లో మార్పులు తెస్తారు. అలా చేస్తే పిల్లలు ఆస్పత్రిలో ఉన్నామన్న మూడ్ నుంచి బయటకు వచ్చి అన్నం తింటారు. మందులు వేసుకుంటారు. పిల్లలకు ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో కూడా పక్కనే ఉండి పిల్లల్ని నవ్విస్తూ డాక్టర్లకు హెల్ప్ చేస్తారు శీతల్. ‘ఈ కాన్సెప్ట్ నచ్చిన ఎన్నో ఆస్పత్రులు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయని’ చెప్పింది శీతల్.
మెడికల్ క్లౌనింగ్ అంటే..
హాస్పిటల్లో ఉన్న రోగులకు కౌన్సెలింగ్ ద్వారా భయాల్ని పోగొట్టడం అందరికీ తెలుసు. ‘మెడికల్ క్లౌనింగ్’ కూడా అలాంటిదే. రోగులను మెడికల్ యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ‘నవ్వు’ను వాడటం. అలా నవ్వుతూ.. నవ్విస్తూ పేషెంట్స్ను రిలాక్స్ చేయడాన్ని మెడికల్ క్లౌనింగ్ అంటారు. ఢిల్లీలో ఇది ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్గా పెరుగుతున్న కొత్త కాన్సెప్ట్.