Jana Nayagan Censor Row: ‘జన నాయగన్’ సర్టిఫికేషన్‌పై ఉత్కంఠ.. తీర్పును రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు

Jana Nayagan Censor Row: ‘జన నాయగన్’ సర్టిఫికేషన్‌పై ఉత్కంఠ.. తీర్పును రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు

దళపతి విజయ్ నటించిన “జన నాయగన్” సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్, అనేక అడ్డంకుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సంబంధించిన కేసు మద్రాస్ హైకోర్టులో కొంతకాలంగా పెండింగ్‌లో ఉండగా, ఇవాళ మంగళవారం (జనవరి 20, 2026) ఈ వ్యవహారంపై కీలక విచారణ జరిగింది.

‘జన నాయగన్’ కు యూఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలని ఆదేశించిన సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు మంగళవారం (జనవరి 20) తన తీర్పును రిజర్వ్ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం దాదాపు మూడు గంటల పాటు సాగిన వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ధర్మాసనం గతంలోనే స్టే విధించిన సంగతి తెలిసిందే. 

అయితే, ఇవాళ మధ్యాహ్నం CBFC తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్ తన వాదన వినిపించారు. ‘‘పరీక్షా కమిటీ సూచించిన 14 కట్స్ తాత్కాలికమైనవి మాత్రమేనని, అవి తుది నిర్ణయం కాదని.. ‘మధ్యవర్తి చర్య’గా పరిగణించాలని స్పష్టం చేశారు. సినిమాపై CBFC చైర్‌పర్సన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు.

ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపించారనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా, జనవరి 6న నిర్మాతలకు ఈ విషయమై సమాచారం ఇచ్చినట్లు CBFC తెలిపింది. గతంలో సింగిల్ జడ్జి ముందు జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వలేదని కూడా CBFC వాదించింది.

మరోవైపు, నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్, పరీక్షా కమిటీ ఏకగ్రీవంగా ఇచ్చిన సిఫార్సుల అనంతరం, CBFC ప్రాంతీయ కార్యాలయం చిత్రానికి యూఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలనే నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేసిందని తెలిపారు. ఆ దశలో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పునఃసమీక్ష కోసం పంపే అధికారం లేదని ఆయన వాదించారు.

“పరీక్షా కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒక సభ్యుడు భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, మెజారిటీ నిర్ణయం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మైనారిటీ అభిప్రాయమే అమల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు,” అని ఆయన అన్నారు.

అదేవిధంగా, ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను నిర్మాతలు ఇప్పటికే తొలగించినట్లు పరాశరన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. “ఇప్పటికే తొలగించిన సన్నివేశాలను మళ్లీ చేర్చి, సినిమాను మునుపటిలా సమర్పించి, ఆపై అవే సన్నివేశాలను తిరిగి తొలగించమని కోరుతున్నారు. ఇది వాస్తవాలపై ఆధారపడిన విషయం. దీనిపై ఎలాంటి వివాదం లేదు. ఇది పూర్తిగా టైం వేస్ట్ ప్రక్రియ మాత్రమే” అని ఆయన వ్యాఖ్యానించారు.