కోహ్లీని ఓపెనింగ్‌లో దించడం మంచిదే

కోహ్లీని ఓపెనింగ్‌లో దించడం మంచిదే

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌‌ను టీమిండియా సొంతం చేసుకుంది. శనివారం ఉత్కంఠగా జరిగిన చివరి పోరులో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా బ్యాటింగ్‌‌లో కెప్టెన్ కోహ్లీ, హిట్‌‌మ్యాన్ రోహిత్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లీష్ పేసర్ల పనిపట్టారు. దీంతో భారీ స్కోరు సాధించిన భారత్.. అనంతరం బౌలర్లు రాణించడంతో ఇంగ్లండ్‌‌పై 36 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. భారత బ్యాట్స్‌‌మెన్‌‌పై సీనియర్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ ఓపెనర్‌గా వచ్చి టెండూల్కర్‌ను గుర్తు చేశాడని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. 

‘పరిమిత ఓవర్ల ఫార్మాట్‌‌లో టీమ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌‌ను‌‌ సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాంచాలి. అందుకే విరాట్ కోహ్లీని టాపార్డర్‌‌లో ముందుగానే దింపాలి. కాబట్టి కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడం ఒకింత మనకు మంచిగానే మారింది. ఎందుకంటే ఓపెనింగ్ జోడీ గురించి మనం పునరాలోచించుకునే ఆస్కారం కలిగింది. ఒకప్పుడు సచిన్ బ్యాటింగ్‌‌లో కింద ఆడేవాడు. కానీ అవసరాన్ని బట్టి అతడ్ని టాపార్డర్‌లో ఆడించినప్పుడు టీమ్ మూమెంటమ్ మారిపోయింది. కాబట్టి టాప్ బ్యాట్స్‌‌మెన్‌ను ఎక్కువ ఓవర్లు ఆడించాలి’ అని గవాస్కర్ చెప్పాడు.