త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఆదివారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దామోదర ప్రసాద్, బీవీఎస్ రవి, అశోక్ కుమార్ కంటెంట్ చాలా బాగుందని, సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ ‘మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాలో ఇంటరెస్టింగ్‌గా చూపించబోతున్నాం. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు చెబుతూనే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’ అని చెప్పాడు. వ్యవసాయం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని పాయల్ రాధాకృష్ణ చెప్పింది.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ ‘వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలనే ఆలోచనతో చేసిన కథ. తప్పకుండా అందరినీ హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమా ఆనందింపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే మీనింగ్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుందని నిర్మాత అరవింద్ అన్నారు. నటులు అనీష్ కురివిల్లా, సత్య కృష్ణ పాల్గొన్నారు.
