ఆడబిడ్డలకు భరోసా ‘వెటా’..రాజకీయాలతో సంబంధం లేదు: వెటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి

ఆడబిడ్డలకు భరోసా ‘వెటా’..రాజకీయాలతో సంబంధం లేదు: వెటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మహిళలు, విద్యార్థినుల సంక్షేమం, వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘వెటా(విమెన్ ఎంపవర్‌‌మెంట్ తెలుగు అసోసియేషన్)’ పనిచేస్తుందని ఆ సంస్థ ఫౌండర్, కాంగ్రెస్​నేత ఝాన్సీ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  మహిళా లోకానికి ‘వెటా’ ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆకాంక్షించారు.

ఈ సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు. నేటికీ సమాజంలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని, చిన్న సమస్య రాగానే ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలచివేస్తోందన్నారు. అలాంటి వారికి వెటా ఒక కౌన్సిలింగ్ సెంటర్‌‌లా అండగా ఉంటుందని చెప్పారు. 

 నియోజకవర్గానికో వాలంటీర్

మహిళలకు చేరువయ్యేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘వెటా’ వాలంటీర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఝాన్సీరెడ్డి వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు కింద తమ నియోజకవర్గంలో ఇప్పటికే 62 మందికి వెటా ట్రస్ట్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌‌కిన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు చిన్న, పెద్ద ఉద్యోగం అని తేడా చూడకుండా ఏదో ఒక పని చేస్తూ ఆర్థికంగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు.