- నిమ్స్ లో రూ.33 కోట్లతో అత్యాధునిక లినాక్ సేవలు
- ఆస్పత్రులు, ల్యాబ్‌ల పర్మిషన్ల కోసం ఆన్‌లైన్ పోర్టల్స్
- వరల్డ్ హెల్త్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి దామోదర
- రెండు రోజుల్లో నర్సింగ్ ఆఫీసర్ల నియామకం పూర్తి చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో కాపా డేందుకు రూ.1,100 కోట్లతో రూపొందించిన సమగ్ర ట్రామాకేర్ పాలసీని వరల్డ్‌హెల్త్ డే సందర్భంగా మంగళవారం ప్రభుత్వం లాంచ్ చేసింది. అలాగే, రాష్ట్రంలో క్యాన్సర్‌ను ‘నోటిఫైబుల్’ వ్యాధి గా ప్రకటిస్తూ క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించింది. నిమ్స్‌లో రూ.33 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధు నిక లినాక్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎర్రగడ్డలో రూ.20 కోట్లతో నిర్మించిన డీ-అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. మరోవైపు రవీంద్రభారతి, నిమ్స్, ఎర్రగడ్డ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పాల్గొని పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. రవీద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల పర్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్ ను, ఐవీఎఫ్, సరోగసీ దరఖాస్తుల కోసం ప్రత్యేక డిజిటల్ పోర్టల్స్‌ను ఆవిష్కరించారు.
అలాగే, ఏఐ టెక్నాలజీతో 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వ హించేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో గత రెండేండ్లలో 10,327 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మరో రెండు రోజుల్లో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 692 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 174 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. మరో 6,512 పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని వెల్లడించారు. నిమ్స్‌లో రూ.33 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక లినాక్ సేవలను ప్రారంభించారు. ట్రూ బీమ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్య కణజాలాన్ని కాపాడుతూ కేవలం ట్యూమర్ పైనే రేడియేషన్ చికిత్స అందించవచ్చని చెప్పారు.
ఎర్రగడ్డలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో నిర్మించిన డీ-అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను దామోదర ప్రారంభించారు. వ్యసనాలు మానాలనుకునే వారికి చికిత్స, కౌన్సెలింగ్ ముఖ్యమని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 35 జనరల్ హాస్పిటల్స్‌లో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలోనే 80 శాతం వైద్య అవసరాలు తీర్చేలా సెకండరీ హెల్త్ కేర్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు తదితరులు పాల్గొన్నారు.
