
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం (ఎస్‌ఎన్ పీ) కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం రూ. 156 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో సరుకులు, కూరగాయలు, గ్యాస్ సరఫరా, కేంద్రాల అద్దెలు వంటి ఖర్చుల కోసం ఈ నిధులను కేటాయించారు.
ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటిని తక్షణమే సమర్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమ అధికారులను ఆదేశించింది. రాబోయే రెండ్రోజుల్లోగా ఆన్ లైన్ ద్వారా బిల్లులను అప్ లోడ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సజావుగా సాగనుంది.