పాతబస్తీ బడులకు రూ.165 కోట్లు.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఏడు నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధి 

పాతబస్తీ బడులకు రూ.165 కోట్లు.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఏడు నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధి 
  • అనుమతులివ్వాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల సర్కారు బడుల అభివృద్ధికి విద్యాశాఖ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. క్యూర్ ఏరియా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.165.67 కోట్లు ప్రతిపాదించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని బహదూర్‌‌‌‌‌‌‌‌పురా, యాకుత్‌‌‌‌‌‌‌‌పురా, కార్వాన్, చార్మినార్, మలక్‌‌‌‌‌‌‌‌పేట్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లోని సర్కారు బడుల్లో నెలకొన్న వసతుల కొరతను సరిదిద్దేందుకు ప్రభుత్వం తొలుత ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీఈడబ్ల్యూఐడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఆయా స్కూళ్లను తనిఖీ చేసి, క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించారు. ప్రస్తుత ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ రేట్ల ఆధారంగా పాఠశాలలు, నియోజకవర్గాల వారీగా భవన నిర్మాణాలు, ఫర్నిచర్ అవసరాలతో కూడిన సమగ్ర అంచనాలను రూపొందించి విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. 

క్లాసు రూములు, ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, లైబ్రరీలు 

టీడబ్ల్యూఐడీసీ చేసిన ప్రతిపాదనల్లో క్లాసు రూముల కొరతను తీర్చడంతో పాటు విద్యార్థులకు ఆధునిక విజ్ఞానాన్ని అందించే అంశాలకు పెద్దపీట వేశారు. దీనిలో భాగంగా రూ.59.40 కోట్లతో 209 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడంతో పాటు, రూ.30 లక్షలతో 32 బడుల్లో విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు. డిజిటల్ బోధనను ప్రోత్సహించేందుకు రూ.22.50 కోట్లతో 77 కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని పెంచేందుకు రూ.13.20 కోట్లతో 45 సైన్స్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో రూ.27.30 కోట్ల వ్యయంతో 92 బడుల్లో ప్రత్యేక లైబ్రరీ గదులను నిర్మించాలని నిర్ణయించారు.

రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు

ఈ ప్రతిపాదిత పనులన్నీ పూర్తి సరికొత్త నిర్మాణాలని, గతానికి సంబంధించిన ఎలాంటి బకాయి పనులు ఇందులో లేవని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు. సమగ్ర శిక్షా వార్షిక ప్రణాళికలో వీటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేనందున, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర బడ్జెట్ ద్వారా ఈ రూ.165.67 కోట్లకు తక్షణమే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే ఈ పనుల బాధ్యతలను టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించి, ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫర్నిచర్ అభివృద్ధి

విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని బాయ్స్ కోసం రూ.7.10 కోట్లతో 142 టాయిలెట్లు, గర్ల్స్  కోసం రూ.6.85 కోట్లతో 137 టాయిలెట్లను ప్రతిపాదించారు. తాగునీటి సదుపాయం కోసం రూ.2.94 కోట్లతో 84  తాగునీటి యూనిట్లు, రూ.74 లక్షలతో 186 వాటర్ ట్యాప్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. క్లాసు రూముల మౌలిక వసతుల కోసం రూ.8.56 కోట్లతో 4,282 డ్యూయల్ డెస్క్‌‌‌‌‌‌‌‌లు, రూ.1.71 కోట్లతో 863 గ్రీన్ చాక్ బోర్డులు, టీచర్ల  కోసం రూ.3.61 కోట్లతో 1,204 టేబుళ్లు, రూ.3.88 కోట్లతో 1,552 కుర్చీలను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు పాఠశాలల రక్షణ కోసం రూ.3.82 కోట్లతో 2,523 మీటర్ల మేర ప్రహరీ గోడల నిర్మాణం, రూ.1.20 కోట్లతో 60 స్కూళ్లలో ఆటస్థలాల లెవలింగ్, రూ.2.54 కోట్లతో 182 బడులకు ఆట వస్తువులను సమకూర్చనున్నారు.