- పట్టాభూములను సాకుగా చూపుతూ ప్రభుత్వ భూమిని కాజేస్తున్న వైనం
- ఇల్లీగల్ భూములపై కన్నేసి.. రూ.కోట్లకు విక్రయిస్తూ సెటిల్మెంట్
- రికార్డుల మాయాజాలంతో రూ.కోట్ల స్కామ్
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో భూ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూములే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ భూ దందాతో రియల్టర్లు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. సర్కారు భూముల కబ్జా, ఇల్లీగల్ భూముల సెటిల్మెంట్లతో రెచిపోతున్నారు.
పక్కనే ఉన్న పట్టా భూమిని సాకుగా చూపి..
గద్వాల సమీపంలోని పూడూరు శివారులో గల సర్వే నంబర్ 414లో ఉన్న ప్రభుత్వ భూమిని ఏకంగా రూ.3కోట్లకు విక్రయించడం ఈ మాఫియా తెగింపునకు నిదర్శనం. మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కనే ఉన్న 12 ఎకరాల పట్టా భూమిని కలిపి పట్టా భూమిగా చిత్రీకరించారు. 12 ఎకరాల పట్టాభూమిని నలుగురు వ్యక్తులు ఒక్కొక్కరు మూడు ఎకరాల చొప్పున్న కొనుగోలు చేయగా, దానికి ఆనుకొని ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా బ్రోకర్లు పట్టా భూమిగా చూపుతూ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి రూ.3 కోట్లకు అమ్మారు. అది ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్పి కొందరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేయడం పట్ల ఫిర్యాదుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారి రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విరాసత్ పేరుతో వెంచర్లలో అక్రమాలు
గద్వాల శివారులోని సర్వే నంబర్ 868/బి లోని నాలుగు ఎకరాలలో జరిగిన భూ కుంభకోణం విస్తుగొలుపుతోంది. గతంలోనే జీపీఎఫ్ ద్వారా విక్రయించి, 240 మంది లబ్ధిదారులకు ప్లాట్లుగా మారిన నాలుగు ఎకరాల భూమిని మాఫియా మళ్లీ టార్గెట్ చేసింది. చట్టవిరుద్ధంగా పాత యజమానుల పేరు మీద విరాసత్ చేయించి, ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులను నట్టేట ముంచారు. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ రికార్డులను మార్చేయడం ఇక్కడి మాఫియా నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో సూచిస్తోంది.
ఇల్లీగల్ భూములే పెట్టుబడిగా కోట్లలో వ్యాపారం
ఇల్లీగల్ భూమిలే టార్గెట్ గా భూమాఫియా రెచ్చిపోతున్నది. అయిజ రోడ్డులోని సర్వే నంబర్ 841 సర్వే నంబర్ లో మిగులు భూమి 20 గుంటలు ఉందని చూయించి పేరు మార్పు చేసుకున్నారు. దానిని ఇతరులకు రూ.2 కోట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అదే ప్రాంతంలోని మరో సర్వే నెంబర్లలోని భూమిని రూ.2 .70 కోట్లకు విక్రయించారు. దానిపై అసలు ఓనర్లు కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ భూమిని కొన్నవారు లబోదిబోమంటున్నారు.
కోర్టులో ఉండగానే రికార్డు మార్చేశారు..
గద్వాల టౌన్ పరిధిలోని 780/సిలోని భూమికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. ఇవేవీ పట్టించుకోకుండా రెవెన్యూ ఆఫీసర్లు ఏకపక్షంగా కోట్ల విలువ చేసే ఎకరా భూమిని ఇతరుల పేరుపై మార్పు చేసేశారు. ఇదేమని బాధితులు ప్రశ్నిస్తే రెవెన్యూ ఆఫీసర్లు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆ భూమి కోసం బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
రెవెన్యూ లోసుగులతో..
గద్వాల నుంచి కర్నూల్ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ సేకరించిన భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించకపోవడం భూ మాఫియాకు పెద్ద అవకాశంగా మారింది. జమ్మిచెడు శివారు నుంచి అనంతపురం స్టేజి వరకు గద్వాల, కర్నూల్ మెయిన్ రోడ్డు ఉన్నది. అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఆర్ అండ్ బీ శాఖ భూ సేకరణ చేసింది. కానీ జమ్మిచెడు శివారు నుంచి అనంతపురం స్టేజి వరకు ఉన్న భూములు రికార్డుల నుంచి తొలగించకపోవడంతో అవి ఇప్పుడు అక్రమార్కులకు అవకాశంగా మారుతున్నాయి.
ఈ ప్రాంతంలోని 341 సర్వే నెంబర్లో మొత్తం రెండు ఎకరాల ఒక గుంట పొలం ఉన్నది. అందులో ఇదివరకే ఒక ఎకర 11 భూమి ఇతరులకు అమ్మారు. కాగా, 20 గుంటలలో మొత్తం 12 ప్లాట్లతోపాటు 12 గంటల భూమి ఆర్ అండ్ బీ రోడ్డుకు పోయినట్లు, ఏడు గుంటల భూమిలో కాలనీ కోసం రోడ్లు వేసినట్లు చూపిస్తున్నప్పటికీ ఇంకా 21 గుంటల భూమి ఉన్నట్లు చూపిస్తూ కొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. బాధితులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ భూమి అన్యాకాంతం కాకుండా చూస్తాం. సర్వేనెంబర్ 414 లో జరిగిన భూ దందాపై ఎంక్వయిరీ చేస్తాం. వెంచర్ వేసిన భూమికి విరాసత్ చేసిన విషయంపై రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కోర్టులో కేసు ఉండగా భూబదులాయింపుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తాం. ఆర్ అండ్ బీ భూ సేకరణ చేసిన భూమి రికార్డులను వెరిఫై చేసి రికార్డుల నుంచి తొలగిస్తాం.
– మధుమోహన్, అడిషనల్ కలెక్టర్, గద్వాల
