ధాన్యం టెండర్ల పైసలు సగం కూడా రాలే..రూ.7,600 కోట్లలో రూ.3,800 కోట్లు ఇంకా రాలే

ధాన్యం టెండర్ల పైసలు సగం కూడా రాలే..రూ.7,600 కోట్లలో రూ.3,800 కోట్లు ఇంకా రాలే
  •     రెండేండ్ల కింద 38 లక్షల టన్నులు టెండర్ల ద్వారా విక్రయించిన సర్కారు
  •     మిల్లర్ల అక్రమ దందాతో అప్పుల కుప్పగా సివిల్​ సప్లైస్​ 
  •     నెలనెలా వందల కోట్ల వడ్డీల భారం

హైదరాబాద్, వెలుగు: సివిల్  సప్లైస్  కార్పొరేషన్  టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యానికి సంబంధించి రావాల్సిన రూ.వేల కోట్లలో సగం కూడా రావడం లేదు. దీంతో ఆ శాఖ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం 2022–23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో 38 లక్షల టన్నులు టెండర్ల ద్వారా విక్రయించింది. వాటి విలువ రూ.7,600 కోట్లు ఉండగా, ఇప్పటి వరకూ రూ.3,800 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన రూ.3,800 కోట్లు ఇప్పటికీ పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. 

మిల్లర్ల వద్ద ధాన్యమే లేకపోవడంతో బిడ్డర్లు ధాన్యం లిఫ్ట్​ చేయడంలో విఫలమయ్యారు. ముందు మూడు నెలల గడువు ఇచ్చినా, ఆ తర్వాత మరో ఏడాది వరకు గడువు పొడిగించినా.. బిడ్డర్లు దాదాపు సగం మాత్రమే లిఫ్ట్​ అయినట్లు చూపించారు.అయితే మిల్లర్ల అక్రమ దందాలే దీనికి ప్రధానకారణమని విమర్శలు వెలుస్తున్నాయి. కస్టమ్  మిల్లింగ్  రైస్ (సీఎంఆర్) కింద ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా ఓపెన్  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అక్రమంగా అమ్ముకోవడంతో సమస్య ఎదురైందని ఎక్స్​పర్టులు​అంటున్నారు. 

టెండర్లలో బిడ్లు దక్కించుకున్న సంస్థలు సైతం మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం ఎత్తకుండా సంస్థకు నష్టం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సివిల్  సప్లైస్  కార్పొరేషన్  అప్పుల మీద అప్పులు తీసుకుంటూ నెలనెలా వందల కోట్ల వడ్డీలు చెల్లిస్తోంది. టెండర్ల ప్రక్రియలో హిందూస్తాన్  ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్, కేంద్రీయ భండార్, మంచుకొండ ఆగ్రోటెక్  ప్రైవేట్  లిమిటెడ్, న్యాకాఫ్   వంటి నాలుగు కాంట్రాక్టు ఏజెన్సీలు 38 లక్షల టన్నులను 12 లాట్లుగా విభజించి దక్కించుకున్నాయి. ‘పే అండ్ లిఫ్ట్’ విధానంలో మూడు నెలల్లో ధాన్యం ఖాళీ చేయాల్సి ఉండగా, చాలా మంది పే చేయకుండానే, లిఫ్ట్  చేయకుండానే వేల కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. బిడ్లు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు ఒక్క వడ్ల గింజ ఎత్తకుండా వేల కోట్లు వసూలు చేసి, సంస్థకు కొంత మేర చెల్లించి మిగిలింది దండుకున్నారని విమర్శలు ఉన్నాయి. టెండర్ల సమయంలో ఫిజికల్  వెరిఫికేషన్  చేస్తే చాలా మిల్లుల్లో ధాన్యం కనిపించలేదు. 

సివిల్​ సప్లయ్స్​కు లక్ష కోట్ల మేర అప్పుల భారం

 మిల్లర్ల అక్రమ దందా కారణంగా సివిల్  సప్లైస్  కార్పొరేషన్ అప్పుల సమస్య మరింత తీవ్రమైంది. 2025 ఫిబ్రవరి 28 వరకు ఒక్క ఏడాదిలోనే రూ.54,491 కోట్ల అప్పులు చేసినట్లు బడ్జెట్ లోని ‘గవర్నమెంట్ బారోయింగ్స్ అండ్ లోన్ పొజిషన్’ టేబుల్‌‌‌‌‌‌‌‌లో వెల్లడైంది. పాత అప్పులు రూ.57,188 కోట్లతో కలిపి మొత్తం అప్పులు రూ.1,11,679 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం బకాయిలే దాదాపు రూ.75,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు, రేషన్ బియ్యం పంపిణీ, సబ్సిడీలు సకాలంలో అంద క సంస్థ లోన్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. గత మార్చి 18న మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా ఎన్‌‌‌‌‌‌‌‌సీడీసీ నుంచి మరో రూ.22,700 కోట్లు రుణం తీసుకుంది. ఫలితంగా నెలనెలా కోట్ల రూపాయల వడ్డీ భారం పెరుగుతోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఇంకా వసూళ్లు కాలే 

ఈ అక్రమాలపై ప్రభుత్వం కొంతవరకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 109 మంది డిఫాల్టర్ల ఆస్తులను అటాచ్  చేస్తున్నారు. కరీంనగర్, నల్లగొండ, ములుగు తదితర జిల్లాల్లో సీఎంఆర్  ధాన్యం అక్రమాలపై విజిలెన్స్  దాడులు నిర్వహించి సీజ్  చేశారు. గడువు మూడుసార్లు పొడిగించినా సమస్య పరిష్కారం కాలేదు. కేబినెట్  మరిన్ని పొడిగింపులకు అనుమతి నిరాకరించింది. సివిల్  సప్లైస్  కమిషనర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమస్యపై పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి.