V6 News

డబ్బులు డబుల్ ఇస్తామని నమ్మించి రూ.500 కోట్లు కొల్లగొట్టిన్రు..డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ ఘరానా మోసం

డబ్బులు డబుల్ ఇస్తామని నమ్మించి రూ.500 కోట్లు కొల్లగొట్టిన్రు..డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ ఘరానా మోసం
  • ఉమ్మడి కరీంనగర్ లో వెలుగుచూసిన మోసం
  • వందల్లో ఏజెంట్లు, వేలాది మంది బాధితులు
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలు

కరీంనగర్, వెలుగు: నెలనెలా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆరేళ్ల తర్వాత డబుల్‌‌‌‌ ఇస్తామని మభ్యపెట్టి యూనిక్​ మర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ ఘరానా మోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. మూడు, నాలుగేళ్ల క్రితమే చాలా మంది బాండ్ల మెచ్యురిటీ పూర్తయినా వారికి డబ్బులు ఇవ్వకుండా కంపెనీ బోర్డు తిప్పేసింది.

గుజరాత్‌‌‌‌కు చెందిన ఈ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సంస్థ తరఫున వందల మంది ఏజెంట్లు పనిచేయగా, మోసపోయిన బాధితులు వేలల్లో ఉన్నారు. బాధితులు ఒత్తిడి చేయడంతో ఏజెంట్లు కరీంనగర్‌‌‌‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై సంస్థ మోసాలపై చర్చించి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ మోసాలపై ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

మల్టీ లెవల్ దందా..

గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని యూనిక్ ఎస్ఎంసీఎస్ దందా రాష్ట్రంలో పదేళ్ల క్రితమే ప్రారంభమైంది. చైన్ లింక్ విధానంలో క్షేత్రస్థాయిలో ఏజెంట్లను నియమించి, ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ చేస్తే ఆరేళ్ల తర్వాత డబుల్ అమౌంట్ ఇస్తామని నమ్మించారు. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌తో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 2015 నుంచి వేలాది మంది నుంచి వందల కోట్ల డిపాజిట్లు సేకరించారు.

డిపాజిట్లలో కొంత ఐఆర్డీఏ వద్ద ఉందని, సంస్థ చెల్లించకపోయినా ప్రభుత్వం ద్వారా డబ్బులు వస్తాయని ఉద్యోగులు నమ్మించారు. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా డిపాజిట్ చేశారు. 2022, 2023 నాటికే మెచ్యురిటీ వచ్చినా అసలు డబ్బులు కూడా చెల్లించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమతో డిపాజిట్లు చేయించిన ఏజెంట్లను నిలదీస్తున్నారు.

మా ఫ్యామిలీయే రూ.84 లక్షలు కట్టింది

మాకు అడ్డగుంట నర్సయ్య అనే వ్యక్తి ద్వారా ఈ స్కీమ్ గురించి తెలిసింది. మా కుటుంబం నుంచి రూ.84 లక్షల వరకు డిపాజిట్ చేశాం. 2017 నుంచి డిపాజిట్ చేస్తూ వచ్చాం. బాండ్ల మెచ్యురిటీ పూర్తయినా ఒక్క పైసా రాలేదు. ఆఫీసుల్లో బాండ్ పేపర్లు ఇచ్చినా రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. చివరకు కరీంనగర్‌‌‌‌లోని ఆఫీసు కూడా మూసేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.- బాధితురాలు, చొప్పదండి

200 మందిని చేర్పించిన..

నేను 2017లో సంస్థలో చేరి సుమారు 200 మందిని చేర్పించాను. నా కింద ఉన్న ఏజెంట్లు మరో 300 మందిని చేర్పించారు. మొత్తంగా నా ద్వారా 500 మంది చేరి దాదాపు రూ.2 కోట్లు బిజినెస్ చేశారు. మీటింగ్స్‌‌‌‌లో కార్లు, బిల్డింగ్స్ ఇస్తామని ప్రలోభపెట్టి డిపాజిట్లు పెట్టించారు. ఆర్బీఐ కంట్రోల్‌‌‌‌లో ఉందని నమ్మించారు. ఇప్పుడు కస్టమర్లు ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారు.- నాముని భూమయ్య, ఏజెంట్, మానకొండూరు

పరిహారం డబ్బులు పెట్టిన

నా భర్త క్వారీ ప్రమాదంలో చనిపోతే వచ్చిన రూ.5 లక్షల పరిహారం డబ్బులను పిల్లల భవిష్యత్తు కోసం యూనిక్యూలో డిపాజిట్ చేశాను. 2021లో బాండ్ మెచ్యురిటీ అయినా ఇప్పటివరకు డబ్బులు రాలేదు. నాకు సొంతిల్లు కూడా లేదు. టైలరింగ్ చేస్తూ పిల్లలను పోషిస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి.- స్రవంతి, సుల్తానాబాద్, పెద్దపల్లి