హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవుపై ప్రభుత్వం సీరియస్ అయిందన్న వదంతులు రావడంపై తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తమ ఆవేదన ప్రభుత్వంపై వ్యతిరేకతతో చేస్తున్నది కాదని, కనీస హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న శాంతియుత ప్రయత్నం మాత్రమేనని స్పష్టం చేశారు. కఠిన చర్యలు, హెచ్చరికలకు బదులుగా ప్రభుత్వం తమ ప్రతినిధులను చర్చలకు పిలిచి, సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు
