అస్సాం గంజాయి ముఠా గుట్టురట్టు..దాదాపు 60 రోజులు ఈగల్ ఫోర్స్ వేట 

అస్సాం గంజాయి ముఠా గుట్టురట్టు..దాదాపు 60 రోజులు ఈగల్ ఫోర్స్ వేట 
  • కింగ్‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌ సహా ఐదుగురు అరెస్ట్​
  • 24.7 కిలోల గంజాయి, 7 సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు స్వాధీనం
  • సైబరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ ముఠాకు 100 మంది కస్టమర్లు
  • వివరాలు వెల్లడించిన ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ సందీప్ శాండిల్యా 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ రట్టు చేసింది. దాదాపు 60 రోజులపాటు సాగించిన వేటలో అసోంకు చెందిన కింగ్‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌ సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. వారి వద్ద నుంచి 24.7 కిలోల గంజాయిని, 7 సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ సందీప్ శాండిల్యా గురువారం వెల్లడించారు.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి..

అసోంలోని లఖింపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్‌‌‌‌‌‌‌‌ హజారికా గతంలో హైదరాబాద్​లో సెక్యూరిటీ గార్డుగా, డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌గా చేశాడు. జైలు జీవితం తర్వాత స్వగ్రామానికి వెళ్లి తన నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను విస్తరించాడు.  ఒడిశాకు చెందిన సప్లయర్స్​ఆశిష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ బలియార్సింగ్‌‌‌‌‌‌‌‌, దేబాశిష్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ పింకూ నాయక్‌‌‌‌‌‌‌‌ నుంచి వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆర్డర్లు పెట్టి గంజాయిని రప్పించేవాడు.

బాబు బోరా, నిర్మల్‌‌‌‌‌‌‌‌ హజారికా తదితరులు కొరియర్లుగా వ్యవహరిస్తూ గుట్టుగా గంజాయిని హైదరాబాద్​కు చేరవేసేవారు. ఒక కిలో గంజాయితో దాదాపు 150 చిన్న ప్యాకెట్లు తయారు చేసి, ఒక్కొక్కటి రూ.300 చొప్పున నెలకు 40 నుంచి 50 కిలోల గంజాయిని విక్రయించేవాడు. సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే ఈ ముఠాకు సుమారు 100 మంది కస్టమర్లు ఉండటం గమనార్హం. 

 రూ.1.8 కోట్ల వ్యాపారం..

ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 29 వరకు ఆశిష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ నుంచి 88 విడతల్లో రూ.48 లక్షల విలువైన గంజాయిని కొనుగోలు చేశాడు. ఈ వ్యవధిలో దాదాపు 400 కిలోల గంజాయి సప్లై కాగా, 10 నెలల్లో సుమారు రూ.1.8 కోట్ల వ్యాపారం చేసినట్లు ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ విచారణలో తేలింది. గత ఆగస్టులో చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో గంజాయి పట్టుబడిన ఘటన ఈ కేసును కీలక మలుపు తిప్పింది.

ఆ తర్వాత వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక నిఘా ఉంచింది. గంజాయితో భాస్కర్‌‌‌‌‌‌‌‌ ఇంటికి వచ్చిన ఇద్దరు కొరియర్లను అనుసరించింది. పక్కా సమాచారంతో దాడి చేసి భాస్కర్‌‌‌‌‌‌‌‌తోపాటు బాబు బోరా, నిర్మల్‌‌‌‌‌‌‌‌ హజారికా, ప్రణజల్‌‌‌‌‌‌‌‌ దత్తా, ఆకన్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌బన్షీలను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు 1908 టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు లేదా 8712671111 వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందించాలని డైరెక్టర్ సందీప్ శాండిల్యా కోరారు.