హైదరాబాద్, వెలుగు: బీసీ కమిషన్ కార్యాలయంలో బీపీ మండల్ పేరుతో కొత్త లైబ్రరీ ఏర్పాటు చేసినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈనెల 14న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ లైబ్రరీని ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజు కేఎన్ అనంతరామన్ కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా ప్రారంభిస్తారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఇద్దరు మహనీయులు బీసీ వర్గాలకు అందించిన మరపురాని సేవలకు గుర్తుగా వారి పేర్లను లైబ్రరీకి, కాన్ఫరెన్స్ హాల్‌కు పెడుతున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అది బీపీ మండల్ చేసిన కృషి ఫలితమేనని నిరంజన్ గుర్తుచేశారు. బిహార్ మాజీ సీఎంగా, ఎంపీగా పనిచేసిన ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా విశేష సేవలందించారని కొనియాడారు. అలాగే 1968లో ఏపీ బీసీ కమిషన్ తొలి చైర్మన్‌గా కేఎన్ అనంతరామన్ పనిచేశారని తెలిపారు. బీసీల పరిస్థితులను అధ్యయనం చేయాలనుకునే వారికి అనంతరామన్ కమిషన్ నివేదిక ఒక ప్రామాణిక గ్రంథంగా నిలిచిందని వెల్లడించారు. ఈ కొత్త లైబ్రరీలో బీసీలకు సంబంధించిన అన్ని కమిషన్ రిపోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలు, బీసీ మేధావులు అందించిన పరిశోధనాత్మక నివేదికలన్నింటినీ భావితరాలకు అందుబాటులో ఉంచినట్టు నిరంజన్ వివరించారు.
