- విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విద్యను విలీనం చేయడం వల్ల వచ్చే సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఆదేశించారు. సెక్రటేరియట్‌లో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్‌తో సమావేశమై విలీన ప్రక్రియపై చర్చించారు. జూనియర్ కాలేజీల్లో 9, 10 తరగతులు ప్రారంభించేందుకు ఎన్ని కాలేజీల్లో అవకాశం ఉందని ఆరా తీశారు.
ఇంటర్ విద్య విలీనానికి సంబంధించిన చట్టం డ్రాఫ్ట్ ఎంతవరకు వచ్చిందని, దీనివల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా అని అధికారులను అడిగారు. ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనరేట్ ఉద్యోగులకు సర్వీస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరోవైపు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డితోనూ కేశవరావు భేటీ అయ్యారు. విలీనంపై సిబ్బంది, లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ వల్ల కలిగే నష్టాలపైనా ఆరా తీశారు.
