పార్కుల్లో జంటలు హుందాగా వ్యవహరించాలి..జంటపై దాడి ఘటనపై ముంబై మేయర్ వ్యాఖ్యలు

పార్కుల్లో జంటలు హుందాగా వ్యవహరించాలి..జంటపై దాడి ఘటనపై ముంబై మేయర్ వ్యాఖ్యలు

ముంబై: పబ్లిక్ పార్కులకు వచ్చే జంటలు మర్యాద, హుందాతనం పాటించాలని ముంబై మేయర్ రీతూ తావ్డే సూచించారు. ముంబై నగరంలోని కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ గార్డెన్‌లో యువతీయువకులపై కొందరు మైనర్లు దాడి చేసిన ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ దాడిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు. "జంటలు పబ్లిక్ పార్కుల్లో కూర్చోవచ్చు, కానీ అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడం సరికాదు. ఎందుకంటే పార్కులకు వృద్ధులు, తల్లిదండ్రులు కూడా వస్తుంటారు" అని అన్నారు.

అసలేం జరిగింది?

కుర్లా వెస్ట్‌లోని ఓ మాల్ వెనుక ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో ఇటీవల ఓ జంటపై కొందరు మైనర్లు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో.. పదేళ్ల వయసున్న బాలురు సహా కొందరు మైనర్లు ఆ జంటను చుట్టుముట్టి కర్రతో కొడుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.

బాధితులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించారు. ఈ వీడియోపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.