ఎట్టకేలకు నెగ్గారు..ఒక్క ఓటుతో కొందరు.. డ్రా ద్వారా మరికొందరు.. పలు వార్డుల్లో ఉత్కంఠ

ఎట్టకేలకు నెగ్గారు..ఒక్క ఓటుతో కొందరు.. డ్రా ద్వారా మరికొందరు.. పలు వార్డుల్లో ఉత్కంఠ
  •  సింగిల్​ ఓటు తేడాతో దక్కిన విజయం
  • గద్వాలలో రీకౌంటింగ్​తో ఫలితం తారుమారు

వెలుగు నెట్​వర్క్​: మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు పలుచోట్ల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. కేవలం ఒకే ఒక్క ఓటు కొందరికి కౌన్సిలర్​ పీఠాన్ని తెచ్చి పెట్టగా, అదే ఒక్క ఓటు కొందరికి పదవిని దూరం చేసింది. ఒక్క ఓటుతో గట్టెక్కిన వారు సంబురాల్లో, ఓటమిపాలైన వారు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గద్వాలలో మొదట ఒక ఓటుతో ఒకరికి అనుకూలంగా ఫలితం రాగా, రీకౌంటింగ్​లో మరొకరికి అనుకూలంగా రిజల్ట్​ వచ్చింది. 

మిర్యాలగూడ పట్టణంలో 18వ వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి బూడిద సైదులు, బీఆర్​ఎస్​ అభ్యర్థి వల్లంపల్లి వినోద్​కుమార్​పై ఒక్క ఓటుతో గెలిచాడు. ఆ వార్డులో మొత్తం 2,241 ఓట్లు ఉండగా 1,711 పోలయ్యాయి. ఇందులో సైదులుకు 837, వినోద్​కు 836 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపొందాడు.

హనుమకొండ జిల్లా పరకాల ఎన్నికల్లో 17వ వార్డులో బొచ్చు సుభద్ర(కాంగ్రెస్), శనిగరపు రజినీ(బీఆర్ఎస్), దుబాసి లావణ్య(బీజేపీ), ఇనుగాల భారతి(జనసేన) పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 369, బీఆర్ఎస్ అభ్యర్థికి 368, బీజేపీ అభ్యర్థికి 76, జనసేన అభ్యర్థి భారతికి 4 ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కు అప్పీల్ చేశారు. అయినా ఫలితంలో తేడా లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 

గద్వాల మున్సిపాలిటీ 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ, బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగింది. మొదట కౌంటింగ్ జరగా జయమ్మకు 464 ఓట్లు, వెంకటమ్మకు 465 ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో జయమ్మ గెలుపొందినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థనతో రీకౌంటింగ్ చేయగా గెలుపు తారుమారైంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మపై ఒక ఓటు తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించారు.

కొల్లాపూర్​ మున్సిపాలిటీ రెండో వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థి ఉడతల విజయలక్ష్మి ఒక్క ఓటుతో గట్టెక్కారు. సమీప బీఆర్​ఎస్​ అభ్యర్థికి 354 ఓట్లు రాగా విజయలక్ష్మీకి 355 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తి మునిసిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థి ఎజాజ్.. బీఆర్​ఎస్​ అభ్యర్థిపై ఒక్క ఓటుతో  గెలుపొందారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అభ్యర్థులిద్దరికీ సమానంగా 258 ఓట్లు వచ్చాయి. ఒక బ్యాలెట్​ పేపర్​పై కొంచెం అటు ఇటుగా ఉన్న గుర్తును స్కేల్​ పెట్టి మరీ కొలిచిన ఎన్నికల అధికారులు ఎజాజ్​ గెలుపొందినట్లు ప్రకటించారు. నాగర్​కర్నూల్​ మునిసిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన ముమ్మడి జయలక్ష్మి రీకౌంటింగ్​లో 2 ఓట్లతో గెలుపొందారు.

మెదక్ పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడకంటి హరిత(ఇందు) ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. హరితకు 366 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రావుకు 365 ఓట్లు వచ్చాయి. 2020 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హరిత, ఈ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు.

డ్రా ద్వారా ఫలితం

నర్సాపూర్​/ తూప్రాన్/ సిద్దిపేట, వెలుగు: కొన్ని వార్డుల్లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో విజేతను ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు స్థానంలో బీఆర్ఎస్  అభ్యర్థి లలిత, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతికి సమానంగా 253 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయగా బీఆర్​ఎస్​ అభ్యర్థి లలిత విజేతగా నిలిచారు. 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ ఎస్ అభ్యర్థి సత్య లింగంకు 331 ఓట్లు, ఇండిపెండెంట్​ అభ్యర్థి గజ్జెల కృష్ణకు 330 ఓట్లు వచ్చాయి. సత్యలింగం ఒక ఓటుతో విజయం సాధించినట్టు అధికారులు డిక్లేర్ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గజ్జెల కృష్ణ రీకౌంటింగ్ కు అప్లై చేశారు. మళ్లీ ఓట్లను లెక్కించగా ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 330 ఓట్ల చొప్పున వచ్చాయి. 

అభ్యర్థుల అంగీకారం మేరకు డ్రా తీయగా బీఆర్ఎస్ అభ్యర్థి సత్యలింగంను విజయం వరించింది. దుబ్బాక పట్టణంలోని మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి  ఎల్లవ్వ, బీజెపీ అభ్యర్థి శ్రీలతకు సమానంగా 266 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ జరిపినా తేడా లేకపోవడంతో టాస్ వేసి  ఎల్లవ్వను విజేతగా ప్రకటించారు.