ఖలిస్తాన్ టెర్రరిస్టు హత్య.. కెనడా వాదనలను తిప్పికొట్టిన భారత్

ఖలిస్తాన్ టెర్రరిస్టు హత్య.. కెనడా వాదనలను తిప్పికొట్టిన భారత్

మూడు నెలల కింద హత్యకు గురైన ఖలీస్థాన్ మద్దతుదారు, ఎన్ఐఏ జాబితాలోని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్‌‌ మరణం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వాదించారు. దాంతో పాటు భారత్ దౌత్యవేత్తను సైతం బహిష్కరించారు. ఈ ఏడాది జూన్‌ 18న హరదీప్ హత్యకు గురయ్యాడు. సర్రే సిటీలో గురు నానక్ సిక్ గురుద్వారా వద్ద హరదీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. రీసెంట్ గా ఒట్టావాలోని భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరించడం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్టయింది.

ALSO READ: సెల్ బిల్లు తరహాలో.. ఎక్స్ (ట్విట్టర్) ఛార్జీలు.. మస్క్ న్యూ ప్లాన్

హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు తమ ప్రభుత్వం దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమకు సహకరించాలని భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారాయన. ఈ వాదనలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. "ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు.. కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తాయి. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పుగా మారనున్నాయి. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించడం ఆందోళనగా ఉంది అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇటీవల G20 సదస్సు సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచాయి. కేంద్రం ప్రకటన ప్రకారం.. ట్రూడోతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కెనడాలో తీవ్రవాద మూకలు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవల భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను కెనడా నిలిపివేసింది. విద్వేషాలను వ్యతిరేకిస్తూనే.. భావవ్యక్తీకరణ, శాంతియుత నిరసన స్వేచ్ఛను ఎల్లప్పుడూ కాపాడుతుందని ట్రూడో స్పష్టం చేయటం విశేషం.