హెచ్-1బీ వీసాపై వైట్ హౌస్ క్లారిటీ.. $100,000 ఫీజు మీకు కాదు.. వాళ్ళకి..: ట్రంప్ అధికారి

హెచ్-1బీ వీసాపై వైట్ హౌస్ క్లారిటీ.. $100,000 ఫీజు మీకు కాదు.. వాళ్ళకి..: ట్రంప్ అధికారి

అమెరికా ఆధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన $100,000 హెచ్-1బీ వీసా ఫీజు కేవలం కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారికి కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ ఫీజు ప్రకటన తర్వాత ప్రజల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి ఈ ప్రకటన చేసింది.  

దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక  ఆర్డర్ పై సంతకం కూడా చేశారు. దాని ప్రకారం హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు $2,000–$5,000 నుంచి ఒక్కసారిగా ఏకంగా $100,000కి పెరిగింది. ఇది సాధారణంగా ఉండే వీసా ఫీజు కంటే చాలా రేట్లు ఎక్కువ. అయితే, ఇది ఏడాది  ఫీజు కాదని, ఒక్కసారి మాత్రమే కట్టాల్సిన ఫీజు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ శనివారం వివరించారు. ఈ ఫీజు పెంపుతో వలసలు, భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికా బయట దేశాల్లో ఉన్న వీసాదారులలో తీవ్ర ఆందోళనల సృష్టించింది. దీంతో ఈ గందరగోళాన్ని తొలగించడానికి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మూడు ముఖ్యమైన విషయాలను స్పష్టం చేశారు.

1.ఇది ఏడాది ఫీజు కాదు. వీసా దరఖాస్తుదారులు దరఖాస్తుకు ఒక్కసారి మాత్రమే కట్టాల్సిన ఫీజు.
2.ఇప్పటికే హెచ్-1బీ వీసా ఉన్నవారు, విదేశాల్లో ఉండి అమెరికాకి తిరిగి  వచ్చేవారికి  ఈ $100,000 ఫీజు వర్తించదు. అలాగే వారు ఎప్పటిలాగే మామూలుగానే అమెరికా విడిచి వెళ్లి తిరిగి రావచ్చు.
3.ఈ ఫీజు కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది, వీసా రెన్యూవల్ లేదా ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదు.

వీసా ఫీజు పెంపు ప్రకటన తర్వాత, భారతదేశంలో ఉన్న ఐటి ఉద్యోగులను వెంటనే  తిరిగి రావాలని పలు కంపెనీలు కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఒక సీనియర్ అమెరికా అధికారి మాట్లాడుతూ భారతదేశానికి ప్రయాణించేవారు లేదా వెళ్ళినవాళ్ళు తొందరపడి తిరిగి అమెరికాకి రావాల్సిన అవసరం లేదు, అలాగే $100,000 ఫీజు కూడా కట్టాల్సిన పని లేదు అని చెప్పారు.

అమెరికా, భారతదేశం రెండు దేశాల్లోని పరిశ్రమ నిపుణులు, టెక్కీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్-1బీ వీసా  సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ నిబంధనల గురించి ఆలోచించేటప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలను, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని వైట్ హౌస్ సూచించింది.